కర్నూలు కల్చరల్: దేవదాయ శాఖకు సంబంధించిన ఆలయాలు, సంస్థలకు చెందిన నిధులు దుర్వినియోగం కాకుండా ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇకపై ప్రతి ఫిక్స్‌డ్ డిపాజిట్ ఈఓతో పాటు సంబంధిత దేవదాయశాఖ అధికారితో కలిపి సంయుక్త పేరిట ఉండాలనే మార్గదర్శకాలను జారీ చేశారు. ఆలయాలకు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) నిధులను కొందరు ఈఓలు గుట్టుచప్పుడు కాకుండా తీసుకుని సొంతంగా వాడుకుంటున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇద్దరు ఈఓలు వారి పరిధిలోని దేవాలయాల ఎఫ్‌డీలను స్వాహా చేశారు. వారిపై కేసులు పెట్టి సస్పెండ్ చేశారు తప్ప నిధులు రీకవరీ చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఎఫ్‌డీలు స్వాహా కావడంతో మేల్కొన్న దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఈఓల పరిధిలో ఉన్న ఆలయాల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లను గ్రూప్‌ల వారీగా తనిఖీ చేయించారు. దీనికి పైతం కొందరు ఈఓలు సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒక్కొక్కరు, వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు ఈఓలు వారి ఆలయాల ఎఫ్‌డీల పరిశీలనకు సహకరించడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి ఫిక్స్‌డ్ డిపాజిట్ ఈఓతో పాటు సంబంధిత దేవదాయశాఖ అధికారితో కలిపి సంయుక్త పేరిట ఉండాలనే ఆదేశాలు ఇచ్చారు.
కమిషనర్ ఆదేశాలు పాటించాలి
కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో ని ఈఓలు నలుగురు ఇంకా వారికి సంబంధించిన గ్రూప్ టెంపుల్స్ ఎఫ్‌డీల ఫైల్స్‌ను చూపించడం లే దు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశాం. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలి.
– పి. గురుప్రసాద్, డిప్యూటీ కమిషనర్,
దేవాదాయ శాఖ
ఈఓ, జిల్లా దేవదాయ శాఖ అధికారి పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్లు