నలుగురు పిల్లలతో అరుగుపై నివాసం | - | Sakshi
Sakshi News home page

నలుగురు పిల్లలతో అరుగుపై నివాసం

Jun 17 2026 5:33 AM | Updated on Jun 17 2026 5:33 AM

కిస్తీలు కట్టలేదని ఇంటికి తాళం ఆడబిడ్డలున్నారన్నా వినకుండా మైక్రో సంస్థ అమానుషం సొంత ఇంటి బయటే పరాయి వారిలా జీవనం సాగిస్తున్న బాధితురాలు

అధికారులు చర్యలు తీసుకోవాలి..

కడుపు తరుక్కుపోతోంది..

భర్తను కోల్పోయిన బీదరాలిపై ‘ఇన్ఫినిటీ’ దాష్టీకం

చల్లపల్లి: ఓవైపు భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖం.. మరోవైపు నలుగురు పిల్లల్ని ఎలా సాకాలో తెలియక దిక్కుతోచని స్థితి.. ఈ లోపు ఓ మైక్రో ఫైనాన్స్‌ సంస్థ అమానుషత్వ ధోరణి ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. తీసుకున్న అప్పు కట్టలేదనే నెపంతో మానవత్వాన్ని మరచిపోయి, ఆ నిరుపేద ఇంటికి తాళాలు వేశారు. అప్పు కడితేనే తాళాలు ఇస్తామని హుకుం జారీచేయటంతో ఆమె తన నలుగురు చిన్నపిల్లలతో సొంత ఇంటి ఆవరణలోనే పరాయివారిలా కాలం నెట్టుకొస్తున్నారు.

ఏం జరిగిందంటే..

కృష్ణాజిల్లా, చల్లపల్లి మండలం పురిటిగడ్డ గ్రామానికి చెందిన కాకి మహేష్‌ అతని భార్య సుకన్య 2024 ఫిబ్రవరిలో రేపల్లెకు చెందిన ఇన్ఫినిటీ మైక్రో ఫైనాన్స్‌ సంస్థ నుంచి ఇంటి నిర్మాణం నిమిత్తం రూ.3లక్షలు అప్పు తీసుకున్నారు. అప్పట్లో తొలుత రెండు లక్షలు మాత్రమే ఇచ్చి మరో లక్ష తరువాత ఇస్తామన్నారు. అప్పు తీసుకున్న కొంత కాలానికి మహేష్‌ అనారోగ్యానికి గురై మృతిచెందారు. సంపాదించే భర్తను కోల్పోవటంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. లోను తాలూకా సంస్థ నుంచి రావాల్సిన మరో లక్ష ఇవ్వమని కోరింది. అయితే ఇంటి పనులు పూర్తయ్యాక ఆ లక్ష ఇస్తామని అప్పటి వరకూ వాయిదా సొమ్ము కట్టాల్సిందేనని అన్నారు. 2025 వరకూ నానా కష్టాలు పడి లోను కిస్తీలు కట్టుకుంటూ వచ్చింది. కూలీ పనులు చేయగా వచ్చే కొద్దిపాటి మొత్తంతోనే ఓ పక్క తన ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు మొత్తం నలుగురు పిల్లల చదువు, ఇంటి ఖర్చులు క్రమంగా భారంగా మారటంతో తీసుకున్న లోన్‌కు సంబంధించిన వాయిదాలను సకాలంలో చెల్లించలేకపోయింది. రోజువారీ పనులు కూడా సరిగా దొరక్కపోవటంతో అసలు ఇల్లు కూడా గడవని పరిస్థితి. కొంత తేరుకున్నాక రూపాయి రూపాయి కూడబెట్టి లోను కడతానని బతిమాలినా మైక్రో ఫైనాన్స్‌ నిర్వాహకులు ఏమాత్రం కనికరించలేదు. వారం రోజుల క్రితం వచ్చి ఇంటికి తాళాలు వేశారు. తనకు ఇల్లు తప్ప మరో నీడలేదని ఆడపిల్లలతో ఎక్కడికి వెళ్లాలని.. మైక్కో ఫైనాన్స్‌ నిర్వాహకులను బతిమలాడింది. అయినా వారు కనికరించకుండా వెళ్లిపోయారు. చేసేది లేక ఎక్కడికి వెళ్లాలో తెలియక సొంత ఇంటి వసారాలోనే పరాయి వారిలా తన నలుగురు పిల్లలో కాలం గడుపుతోంది.

ఆశగా ఎదురుచూపులు..

నలుగురు పిల్లలు పురిటిగడ్డ హైస్కూల్లో చదవుతున్నారు. స్కూలుకు వెళ్లాలన్నా పుస్తకాలు లేవు. కట్టుకోవటానికి బట్టలు కూడా లేవు. అన్ని ఇంట్లోనే ఉండిపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తన నలుగురు పిల్లలతో ఆ తల్లి ఎండనకా.. వాననకా తాళం వేసిన ఇంటి ముందే దీనంగా కూర్చొని ఫైనాన్స్‌ వారు ఎప్పుడు వస్తారా.. ఎప్పుడు తాళాలు తీస్తారా అని ఆశగా ఎదురు చూస్తోంది. చుట్టపక్కల తెలిసిన వారు ఆహారం అందిస్తున్నప్పటికీ ఆ కుటుంబ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

నిబంధనల ప్రకారం మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు తీసుకున్నవారిని మానసికంగా గానీ, శారీరకంగానో వేధించకూడదు. ఇళ్లకు తాళాలు వేసే హక్కు వారికి ఉండదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక పేద దళిత కుటుంబాన్ని రోడ్డున పడేసిన మైక్రో ఫైనాన్స్‌ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళ, పిల్లలకు న్యాయం చేయాలి.

– దేవరపల్లి సురేష్‌బాబు, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

నా భర్త పోయిన దుఃఖం నుంచి పూర్తిగా బయటకు కూడా రాకముంతే మైక్రో ఫైనాన్స్‌ వారు కిస్తీలు కట్టలేదని ఇంటికి తాళాలు వేశారు. పిల్లల పుస్తకాలు, బట్టలు అన్నీ లోపలే ఉన్నాయి. పుస్తకాలు లేకుండా బడికి ఎలా వెళ్తారు? నా పిల్లలు ఇంటి అరుగులపైనే కాలం గడుపుతుంటే కడుపు తరుక్కుపోతోంది. పరిస్థితి బాగున్నాక లోను కట్టుకుంటా. మైక్రో ఫైనాన్స్‌ వారు నా మొర ఆలకించి ఇంటికి వేసిన తాళాలు ఎప్పుడు తీస్తారా అని ఆశగా నేను, నా పిల్లలు ఎదురు చూస్తున్నాం.

– కాకి సుకన్య, బాధితురాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement