పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో యువత, స్వయం సహాయక సంఘాల మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుని, సమర్థవంతమైన ప్రణాళిక, నాణ్యత, మార్కెటింగ్ విధానాలతో పెద్ద పరిశ్రమల స్థాయికి ఎదగాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. కలెక్టరేట్‌లోని ఎ.వి.ఎస్.రెడ్డి హాల్‌లో అర్బన్ జిల్లా సమాఖ్య, ఫౌండర్స్ రూఫ్, వివిధ స్టార్టప్‌ల ప్రతినిధులతో కలెక్టర్ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మహిళల భద్రత, స్మార్ట్ వెహికల్ మేనేజ్మెంట్, ప్రొటీన్ ఇన్ఫ్యూజ్డ్ కాఫీ, డీహైడ్రేషన్, ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ వంటి వివిధ భాగాల్లో స్టార్టప్‌లు ప్రారంభించిన యువతతో సమాలోచనలు చేశారు. జిల్లాలో స్టార్టప్‌ల ద్వారా ఆర్థికంగా ఎదగడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని సూచించారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన వ్యాపారాలు సమర్థవంతమైన ప్రణాళిక, నాణ్యత, మార్కెటింగ్ విధానాలతో ముందుకు సాగితే పెద్ద పరిశ్రమల స్థాయికి ఎదుగుతాయని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని వినూత్న ఆలోచనలతో వ్యాపార రంగంలో ముందుకు సాగాలని యువతకు సూచించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో మార్కెటింగ్ విధానాలు వేగంగా మారుతున్నాయని, సోషల్ మీడియా, ఈ –కామర్స్ వేదికలను ఉపయోగించుకోవడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ లభిస్తుందని వివరించారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లవచ్చని చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
ప్రభుత్వం అందిస్తున్న శిక్షణలు, ఆర్థిక సహాయం, ప్రోత్సాహక పథకాలను వినియోగించుకుని స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడ కుండా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అర్బన్ సమాఖ్య ప్రెసిడెంట్ కె.మీనాక్షి, ఎస్‌హెచ్‌జీ పారిశ్రామికవేత్తలు వాణి, మాధురి, కృష్ణవేణి, ఫౌండర్స్ రూఫ్ సారథులు విష్ణు, జగదీష్, వివిధ స్టార్టప్‌ల స్థాపకులు ఉజ్వల్ బొర్రా, విఠల్, సతీష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


