నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం

Apr 6 2026 8:30 AM | Updated on Apr 6 2026 8:30 AM

నల్ల బ్యాడ్జీలతో ఫ్యాప్టో నిరసన

6 నుంచి 15 వరకు వాల్యుయేషన్‌

ఎన్టీఆర్‌ జిల్లాకు చేరుకున్న 1,73,427 జవాబు పత్రాలు

కృష్ణాకు చేరుకున్న 1.84 లక్షల పత్రాలు

ట్యాబ్‌ల ద్వారా మార్కుల నమోదు విధానం అమలు

లీప్‌ యాప్‌తో ఆన్‌లైన్లో అప్‌లోడ్‌

అన్నీ ఏర్పాటుచేశాం

ఏర్పాట్లు పూర్తి చేశాం

మచిలీపట్నంఅర్బన్‌/వన్‌టౌన్‌(విజయవాడ పశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవాడ కేబీఎన్‌ కాలేజీ, కృష్ణా జిల్లా యాంప్తిల్‌ ప్రభుత్వ బాలకల పాఠశాలలో స్పాట్‌ వాల్యుయేషన్‌కు ఏర్పాట్లుచేశారు. ఎన్టీఆర్‌ జిల్లాకు 1.73 లక్షలు, కృష్ణాకు 1.84 లక్షల సమాధాన పత్రాలు వచ్చాయి. మూల్యాంకన సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం లేకుండా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు విధులను కేటాయించి ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌ 6 నుంచి 15 వరకు మూల్యాంకనం నిర్వహించనున్నారు.

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో..

మూల్యాంకన ప్రక్రియ కోసం ఎన్టీఆర్‌ జిల్లాకు మొత్తం 699 మంది సిబ్బందిని నియమించారు. అసిస్టెంట్‌ ఎగ్జామినర్స్‌ 409, చీఫ్‌ ఎగ్జామినార్స్‌ 75, స్పెషల్‌ అసిస్టెంట్స్‌ 215 మంది ఉన్నారు. కృష్ణా జిల్లాకు 741 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 433 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, 78 మంది చీఫ్‌ ఎగ్జామినర్లు, 230 మంది స్పెషల్‌ అసిస్టెంట్లు ఉన్నారు.

ఉదయం 9 గంటలకు హాజరు తప్పనిసరి

మూల్యాంకన కేంద్రంలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ఒక్కో టేబుల్‌ వద్ద అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, స్పెషల్‌ అసిస్టెంట్లు, ఒక చీఫ్‌ ఎగ్జామినర్‌ ఉంటారు. కేంద్రంలో సౌకర్యాల కల్పన మూల్యాంకన కేంద్రంలో సీసీ కెమెరాలు, తాగునీటి సౌకర్యం, లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పోలీసు బందోబస్తు కల్పించారు. ప్రథమ చికిత్స కోసం ఏఎన్‌ఎంలు, సిబ్బంది, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచారు.

ట్యాబ్‌ ద్వారా మార్కుల నమోదు

ఈసారి సమాధాన పత్రాల మూల్యాంకనంతో పాటు మార్కులను ట్యాబ్‌లలో నమోదు చేసే విధానం అమలు చేస్తున్నారు. మాన్యువల్‌ ప్రక్రియ అనంతరం స్పెషల్‌ అసిస్టెంట్లు వెంటనే మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి అప్‌లోడ్‌ చేయనున్నారు.

స్పెషల్‌ అసిస్టెంట్లకు సూచనలు

స్పెషల్‌ అసిస్టెంట్లు లీప్‌ యాప్‌లో లాగిన్‌ అయి కంట్రోల్‌ బండిల్‌, ఆన్సర్‌ స్క్రిప్ట్‌లను స్కాన్‌ చేసి మార్కులు నమోదు చేయాలి. నమోదు చేసిన మార్కులను పూర్తిగా తనిఖీ చేసి, ప్రివ్యూ అనంతరం కన్ఫర్మ్‌ అండ్‌ ప్రొసీడ్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలి. ఒకసారి ఫైనల్‌ సబ్మిషన్‌ చేసిన తర్వాత మార్పులకు అవకాశం ఉండదు.

ఉపాధ్యాయులు, పెన్షనర్ల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో జిల్లా శాఖ ఆధ్వర్యంలో ‘పది’ స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. సోమవారం నుంచి నల్లబ్యాడ్జీలతో స్పాట్‌ వాల్యుయేషన్‌ విధులకు హాజరవుతూ నిరసన వ్యక్తం చేయనున్నారు. ఏప్రిల్‌ 9న మూల్యాంకన కేంద్రంవద్ద ఆందోళన, 25, 26, 27 తేదీల్లో విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఫ్యాప్టో కృష్ణా జిల్లా చైర్మన్‌ అంబటిపూడి సుబ్రహ్మణ్యం తెలిపారు.

పదో తరగతి స్పాట్‌ వాల్యూయేషన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నగరంలోని కేబీఎన్‌ కళాశాల ప్రాంగణంలో ఈ నెల ఆరు నుంచి 15వ తేదీ వరకూ స్పాట్‌ వాల్యూయేషన్‌ను నిర్వహిస్తున్నాం. స్పాట్‌ జరిగే ప్రాంగణంలో అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాం. అప్పటికే ఉపాధ్యాయులందరికీ సమాచారం అందించాం. అలాగే ఉపాధ్యాయులందరూ ఈ వాల్యూయేషన్‌లో పాల్గొనున్నారు.

–చంద్రకళ, డీఈవో, ఎన్టీఆర్‌ జిల్లా

జిల్లాలో స్పాట్‌ వాల్యుయేషన్‌ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సీసీ కెమెరాల పర్యవేక్షణలో మూల్యాంకన ప్రక్రియ సాగుతుంది. సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు, ట్యాబ్‌ల ద్వారా మార్కుల నమోదు వంటి ఆధునిక విధానాలను అమలు చేస్తున్నాం. మార్కుల నమోదుకు స్పెషల్‌ అసిస్టెంట్లకు శిక్షణ కూడా ఇచ్చాం. ఉపాధ్యాయులు పరీక్షల నిష్పత్తి, నాణ్యతను కాపాడే విధంగా మూల్యాంకనం విధులు నిర్వర్తించి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి.

–యూవీ సుబ్బారావు,

కృష్ణా విద్యాశాఖాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement