భవానీపురం(విజయవాడపశ్చిమ): పారిశ్రామికవేత్తలు, పెట్టుబడీదారులు, సృజనాత్మకత కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ఇటీవల ఏర్పాటైన ‘ఫౌండర్స్ రూఫ్’ కార్యకలాపాలు విజయవంతంగా ముందుకు సాగాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ ఆకాంక్షించారు. ఫౌండర్స్ రూఫ్ సంస్థను నెలకొల్పిన విష్ణు, జగ దీష్‌లు ఆదివారం భవానీపురంలోని హరిత బెరంపార్క్‌లో ఏర్పాటు చేసిన మీటప్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వారి ఆలోచనలు, భవిష్యత్ కార్యాచరణను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారం నిర్వహించే ఫౌండర్స్ రూప్ మీటప్స్ ద్వారా ప్రత్యక్షంగా పరిచయాలు పెంచుకోవడం, పటిష్టమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం, స్టార్టప్ ఆలోచనలను ప్రదర్శించడం వంటి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. విజయవాడ రూరల్ గుంటుపల్లిలోని రైజ్ కేంద్రం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అర్బన్ సమాఖ్య ప్రెసిడెంట్ మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.


