కోర్టు ఆర్డర్‌ ఉంటే చూపించండి | - | Sakshi
Sakshi News home page

కోర్టు ఆర్డర్‌ ఉంటే చూపించండి

Apr 6 2026 8:42 AM | Updated on Apr 6 2026 8:42 AM

కోర్టు ఆర్డర్‌ ఉంటే చూపించండి

సంస్కారం మరచి మాట్లాడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర జనసేన కార్యకర్త ఇల్లు కూలిస్తేమీకేం పనని అనడం అవివేకం మంత్రిగా ఉండి బందరుకు ఏం తెచ్చావో ప్రజలకు చెప్పాలి వైఎస్సార్‌ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని

మచిలీపట్నంటౌన్‌: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సంస్కారం మరచి తనపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం ఇల్లు కూల్చివేయాలని కోర్టు ఆర్డర్‌ ఉంటే చూపించాలని సవాల్‌ విసిరారు. స్థానిక రామానాయుడుపేటలో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి కృష్ణమూర్తి మరణంపై అబద్ధాలు వల్లెవేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తన తండ్రి అనారోగ్యం పాలైతే హైదరాబాద్‌, చైన్నె వంటి నగరాల్లోని ఆస్పత్రుల్లో నెలల పాటు వైద్యం చేయించానని గుర్తుచేశారు. తన తండ్రి తుదిశ్వాస విడిచేవరకు తాను, తన మరో తల్లి విక్టోరియమ్మ ఆయన్ను అంటిపెట్టుకుని ఉన్నామన్నారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తన తండ్రికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వగా ఆయన అనారోగ్య కారణాల రీత్యా తాను డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశానన్నారు. ఎన్నికల ప్రచారం కూడా తానే ఎక్కువగా నిర్వహించానన్నారు. కానీ తాను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానని కొల్లు రవీంద్ర దిగజారి మాట్లాడితే తాను వివరణ ఇవ్వడం తన కర్మగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

పరామర్శించడంలో తప్పేముంది

కొబ్బరి తోటలో జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం ఇల్లు కూల్చివేయాలని కోర్టు ఆర్డర్‌ ఉందని కొల్లు రవీంద్ర అంటున్నారని, ఆర్డర్‌ను కమిషనర్‌ ద్వారా చూపించాలని పేర్ని నాని సవాల్‌ విసిరారు. కోర్టు ఆర్డర్‌ ఉంటే వారు చెప్పే ఏ శిక్షకై నా తాను సిద్ధమని స్పష్టంచేశారు. ఆర్డర్‌ లేకుంటే ఏ శిక్షకై నా సిద్ధమేనా అని రవీంద్రను ప్రశ్నించారు. రూ.45 లక్షలు ఖర్చు చేసి నిర్మించిన గృహాన్ని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తే బాధితులు ఫోన్‌ చేయగా తాను అక్కడికి వెళ్లానన్నారు. బాధితులను పరామర్శించడంలో తప్పేముందని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్న 2015–16 కాలంలోనే ఈ స్థలానికి ఖాళీ స్థలం పన్నులు వేశారని, 2024లో భవనాలు నిర్మించా రని, అయితే అవి తన హయాంలో జరిగినట్లుగా అవాస్తవాలు చెప్పడం సరికాదని హితవు పలికారు.

బినామీ ఆస్తులు లాక్కోండి

తనకు బినామీ ఆస్తులు ఉన్నాయని విమర్శిస్తున్నా రని, బినామీ ఆస్తుల చట్టం ప్రకారం వాటిని లాక్కోవచ్చుగా అని పేర్ని నాని ప్రశ్నించారు. నగరంలోని పోలీస్‌ కాంప్లెక్స్‌, పోలీస్‌ కల్యాణ మండపం, ఇలా పలు కట్టడాలకు అనుమతులు లేవని వాటిని కూల్చే దమ్ము ఉందా అని సవాల్‌ విసిరారు. నగరంలో ఏఏ భవనాలకు అనుమతులు లేవో జాబితా ఇస్తానని, దమ్మూ ధైర్యం ఉంటే వాటిని కూల్చాలని సూచించారు. చేపల మార్కెట్‌ సమీపాన, బందరు కోట ప్రాంతాల్లో మంత్రి రవీంద్ర నిర్మిస్తున్న భవనాలకు అనుమతులు లేవని, వాటిని కూడా కూల్చే స్తారా అని ప్రశ్నించారు. బందరుకోట స్థలానికి అసలు లింకు డాక్యుమెంట్లే లేవని, ఈ స్థలంలో అక్రమ భవనాన్ని ఎలా నిర్మిస్తున్నారని నిలదీశారు. ప్రధాన రహదారితో పాటు చిలకలపూడిలో రోడ్డు విస్తరణను స్థల యజమానులను ఒప్పించి చేయిస్తే దానిపై కూడా విమర్శలు చేయటం ఎంతవరకు సబబన్నారు. ప్రధాన రహదారిలో కల్పన టెక్స్‌టైల్‌ యజమాని గాంధీని రోడ్డు విస్తరణకు స్థలం ఇవ్వా లని తాను పలుమార్లు కలిసి బతిమిలాడానని, అయినా ఆయన ససేమిరా అనడంతో కోర్టు ఆదేశాల ప్రకారం రోడ్డుకు అవసరమైన మేర స్థలం తీసుకున్నామని గుర్తుచేశారు. తాను 2004 నుంచి 2014 వరకు, 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా ఉండి బందరుకు కృష్ణ యూనివర్సిటీ, నర్సింగ్‌ కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాల, పోర్టు మెడికల్‌ కళాశాల, ఫిషింగ్‌ హార్బర్‌ ఇలా ఎన్నో ప్రాజెక్టులు తీసుకువచ్చానని, పలు కాలనీల్లో రహదారులన్నీ అభివృద్ధి చేశానని వివరించారు. రవీంద్ర హయాంలో ఏ ప్రాజెక్టు తీసుకువచ్చారో ప్రజలకు చెప్పగలరా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులన్నీ తాను కృషి చేయకుంటే గాలికి వచ్చాయా అని ఎద్దేవాచేశారు. జల్లూరి గోపిని విజయవాడ పిలిపించి బెదిరించి ఆయన స్థలాన్ని లాక్కోలేదా అని ప్రశ్నించారు.

విజయవాడలో ఆరు టీవీ చానళ్లు

మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో ఆరు టీవీ చానళ్లు నడుపుతున్నారని, నెలకు రూ.85 లక్షలు ఖర్చు చేస్తున్నారని, ఆ మొత్తానికి సంబంధించి బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా అని పేర్ని నాని ప్రశ్నించారు. తన తల్లి విక్టోరియమ్మ ఆస్తుల విక్రయాల సమయంలో తానే సాక్షి సంతకాలు సైతం చేశానని పేర్ని నాని తెలిపారు. తల కిందులుగా తపస్సు చేసినా తనను వేలెత్తి చూపలేవని కొల్లు రవీంద్రకు హితవు పలికారు. తానేంటో తన నైజం ఏంటో కార్యకర్తలను ఎలా చూసుకుంటానో టీడీపీ కార్యకర్తలనే అడిగి తెలుసుకోవాలని సూచించారు. నిజాలు మాట్లాడితే తప్పు లేదని, కుసంస్కారంతో నీచంగా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా కోశాధికారి బందెల డేవిడ్‌ థామస్‌నోబుల్‌, నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement