ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకునేందుకు శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు విజయవాడ ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. పదో తరగతి పరీక్షలు పూర్తి కావడం, మరో వైపున సుముహూర్తపు వేళ ఒక్కటైన నవ వధువరులతో పాటు శుక్రవారం రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది. మహామండపం లిప్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్‌రోడ్డులోని క్యూలైన్లులో భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో రద్దీ మరింత పెరిగింది. సర్వ దర్శనానికి రెండు గంటల సమయం, రూ. 100, రూ. 300 టికెట్లపై దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. రద్దీ నేపధ్యంలో ఉదయం 10 గంటల తర్వాత రూ. 500 టికెట్ల విక్రయాలను నిలిపివేసి అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో క్యూలైన్‌లో వేచి ఉన్న వారికి మంచినీళ్లు, మజ్జిగను పంపిణీ చేశారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, దర్బారు సేవ, పల్లకీ సేవల్లో భక్తులు విశేషం గా పాల్గొన్నారు.


