విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా

Mar 4 2026 8:21 AM | Updated on Mar 4 2026 8:21 AM

నందిగామ రూరల్‌: ఈత సరదా ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. ఈ ఘటన మండలంలోని కొండూరు గ్రామ సమీపంలోని కూచి వాగు వద్ద మంగళవారం జరిగింది. కొండూరు గ్రామానికి చెందిన బెల్లంకొండ లక్ష్మణరావు, అనూష దంపతులు వ్యవసాయ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దినకరన్‌ (15) మాగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి, రెండో కుమారుడు దినేష్‌ ఏడో తరగతి చదువుతున్నారు. హోలీ పండుగ సందర్భంగా మంగళవారం పాఠశాలకు సెలవు కావటంతో ప్రభు కిషోర్‌, బంశీ, చరణ్‌, కుమార్‌తో పాటు మరో నలుగురు స్నేహితులతో కలిసి దినకరన్‌ కొండూరు–మాగల్లు గ్రామాల మధ్య ఉన్న కూచి వాగులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొడుతున్న క్రమంలో దినకరన్‌ వాగులోని గుంతలో మునుగుతుండటాన్ని స్నేహితులు గమనించి కేకలు వేశారు. చుట్టు పక్కల వారు అక్కడకు చేరుకుని దినకరన్‌ను బయటకు తీసి నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దినకరన్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దినకరన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోదించారు. పట్టణంలోని మార్చురీ వద్దకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement