మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం: చంద్రబాబు ప్రభుత్వమే కల్తీలకు నిలయంగా మారిందని రాయచోటి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన్ను మంగళవారం శ్రీకాంత్‌రెడ్డి పరామర్శించారు. దాడి జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్బంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను గద్దె దింపినప్పటి నుంచి ప్రజాబలం లేని చంద్ర బాబు మేనేజ్డ్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. జోగి రమేష్, అంబటి రాంబాబు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇళ్లపై పోలీసులే దగ్గరుండి దాడులు, హింసను ప్రోత్సహించడం ఏమి సంస్కృతి అని ప్రశ్నించారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చాక దాడులు చేసిన వారిని విడిచిపెట్టబోమన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీచర్లకు 27 శాతం ఐఆర్ ఇచ్చారని, ఇంతవరకు ఐఆర్, పీఆర్సీ గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. సచివాలయ వ్యవస్థ జగన్‌మోహన్‌రెడ్డి మానస పుత్రిక కాబట్టే నిర్వీర్యం చేయాలని చర్యలు చేపట్టారని దుయ్యబట్టారు. గతంలో తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం కూల్చేసిన చంద్రబాబే లడ్డూ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు తెలుసుకోకుండా డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సనాతన ధర్మం అంటూ ఊగిపోయారని ఎద్దేవాచేశారు. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ లడ్డూలో జంతు కొవ్వు లేదని తేల్చిందన్నారు.


