ఆస్తి కోసం అన్నదమ్ముల బాహాబాహీ
●కర్రలు, కత్తులతో కుటుంబ సభ్యుల పరస్పర దాడులు
● రెండు వర్గాల దాడిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
రెడ్డిగూడెం(జి.కొండూరు): ఆస్తి కోసం అన్నదమ్ముల కుటుంబాలు బాహాబాహీకి దిగడమే కాదు, కర్రలు, కత్తులతో పరస్పరం దాడులకు తెగబడిన ఘటన రెడ్డిగూడెం మండలలోని కొత్త నాగులూరు గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కట్టా రాజారావుకి మొదటి భార్య అమృతం, రెండో భార్య సువర్ణ ఉన్నారు. మొదటి భార్య అమృతంనకు కొడుకు అబ్రహాం, సువర్ణకు ఇద్దరు కొడుకులు జమలయ్య, శ్రీను ఉన్నారు. రాజారావు అనారోగ్య సమస్యలతో కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి ముగ్గురు కొడుకుల మధ్య భూ వివాదం కొనసాగుతోంది. రాజారావు జీవించి ఉన్న సమయంలో తన పేరుతో ఉన్న 2.50 ఎకరాల బీఫాం భూమిని తన వద్దనే ఉంచుకొని తన పేరుతో ఉన్న మరో 80 సెంట్ల పట్టా భూమిని మొదటి భార్య కుమారుడు అబ్రహాం పేరుతో రిజిస్ట్రేషన్ చేసి అతని వద్ద కొంత కాలం ఉన్నాడు. ఆ తర్వాత అతను తనను సరిగా చూడటంలేదంటూ రెండో భార్య కుమారుల వద్దకు వెళ్లిన రాజారావు, తన పేరుతో ఉన్న 2.50 ఎకరాల బీఫాం పట్టా భూమిని వారిద్దరి పేరిట రాశాడు. ఆ తర్వాత రాజారావు మృతి చెందగా అప్పటి నుంచి భీపాం పట్టా భూమిలో తనకూ వాటా ఉందని అబ్రహాం, 80 సెంట్ల పట్టా భూమిలో తమకూ వాటా ఉందని జమలయ్య, శ్రీను ఇద్దరు గొడవ పడడం ప్రారంభించారు. ఈ వివాదం ఐదేళ్లుగా కొనసాగుతోంది. గతంలో ఒక సారి రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పెద్దలు పంచాయితీలు చేసి సర్ది చెప్పారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని రెండు వర్గాల వారు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో కత్తులు, కర్రలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో అబ్రహాం, జమలయ్య, శ్రీను, వారి బంధువులైన మేడూరు సురేఖ, కట్టా ఎస్తేరు, మట్టకొయ్య రుషరావు, మట్టకొయ్య పద్మ, మట్టకొయ్య దావీదురాజు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న రెడ్డిగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను మైలవరం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. రెండు వర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీను తెలిపారు.
ఆస్తి కోసం అన్నదమ్ముల బాహాబాహీ


