డాక్టర్ దీపిక మృతిపై వీడని మిస్టరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో అనుమనాస్పద స్థితిలో మరణించిన ఎనస్థీషియా పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థిని డాక్టర్ బత్తుల దీపిక మరణంపై మిస్టరీ వీడలేదు. ఈ నెల ఐదో తేదీన ఆమె ఆపరేషన్ థియేటర్‌లో బెంచీపై కూర్చుని కుప్పకూలి ప్రాణాలు విడిచిన విషయం విదితమే. ఆమె మృతికి సంబంధించిన కారణాలు తెలియలేదు. మరోవైపు సీసీ కెమెరాల్లో సైతం ఆ రోజు రాత్రి 1.10 నుంచి 1.40 గంటల వరకూ ఆపరేషన్ థియేటర్లోకి బయటి వ్యక్తులు ఎవరూ వెళ్లినట్లు రికార్డు కాలేదు. దీంతో ఆమె మృతి మిస్టరీగా మారింది. పోస్టుమార్టం రిపోర్టు కోసం పోలీసులతో పాటు, ఆస్పత్రి అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈ వారాంతంలో ఆ రిపోర్టు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
వైద్య మంత్రికి వినతి
డాక్టర్ దీపిక మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తండ్రి బత్తుల కోదండరామిరెడ్డి నిత్యం పలువురిని కలుస్తూ వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్‌తో పాటు, ఏసీపీ దామోదర్‌ను ఇప్పటికే కలిసి తనకున్న అనుమానాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. తాజాగా గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కలిసి డాక్టర్ దీపిక కళాశాలలో చేరిన వద్ద నుంచి మరణించిన వరకూ జరిగిన ఘటనలు, అనుమానాలను పేర్కొంటూ వినతి పత్రం అందజేశారు.
పీఎం రిపోర్టు వస్తేనే..
దీపిక మృతిపై ఇప్పటికే ముగ్గురు ప్రొఫెసర్లతో ఎనస్థీషియా విభాగంలోని పీజీలు, వైద్యులను విచారణ జరపగా ఎలాంటి ఆధారాలూ తెలియలేదు. ఆమె మృతిపై రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు ఆరా తీశారు. పోలీసులు కూడా కొంత సమాచారాన్ని సేకరించి ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారింది. ఆ రిపోర్టు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


