ఎండీఎంఏ డ్రగ్స్ కేసు నిందితుడి అరెస్టు
లబ్బీపేట(విజయవాడతూర్పు): బెంగళూరు నుంచి విశాఖపట్నానికి ఎండీఎంఏ డ్రగ్స్ తరలిస్తున్న కేసులో పరారీలో ఉన్న నిందితుడు రాజేష్‌ను మాచవరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గత ఏడాది నమోదైన ఈ కేసులో రాజేష్ నిందితుడు. రెండు నెలల కిందట విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్ నుంచి అతను పోలీసుల కళ్లుకప్పి పరారయ్యాడు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్, సెంట్రల్ ఏసీపీ దామోదర్ నేతృత్వంలో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. మాచవరం పోలీసులు, క్రైం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ తరుణంలో నిందితుడికి సంబంధించిన పక్కా సమాచారం పోలీసులకు చిక్కింది. క్రైమ్ కానిస్టేబుల్ తరుణ్ సహకారంతో నిందితుడు రాజేష్‌ను మాచవరం ఇన్‌స్పెక్టర్ రమణ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా నగరంలో డ్రగ్స్ విక్రయ కార్యకలాపాల్లో పాల్గొనట్లు అంగీకరించాడు. అతడిని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించారు.
హనుమాన్‌జంక్షన్ రూరల్: గన్నవరం డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, కేసుల విచారణలో పురోగతిపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గురువారం సమీక్ష నిర్వహించారు. స్థానిక విజయవాడ రోడ్డు స్వరాజ్య నగర్‌లోని హనుమాన్‌జంక్షన్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఆయన క్రైమ్ రివ్యూ నిర్వహించారు. డీఎస్పీ చలసాని శ్రీనివాస్‌తో పాటుగా హనుమాన్‌జంక్షన్, గన్నవరం, పెనమలూరు సర్కిల్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులు, డివిజన్‌లో క్రైమ్ రేట్, రికవరీలపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆరా తీశారు.


