బాలుడిపై వీధి కుక్కల దాడి | - | Sakshi
Sakshi News home page

బాలుడిపై వీధి కుక్కల దాడి

Feb 25 2026 10:41 AM | Updated on Feb 25 2026 10:41 AM

బాలుడిపై వీధి కుక్కల దాడి

బాలుడిపై వీధి కుక్కల దాడి

తీవ్రగాయాలతో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): స్కూల్‌ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న 9 ఏళ్ల బాలుడిపై వీధికుక్కలు విచ్చక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటన కొత్తపేట ఆంజనేయవాగు సెంటర్‌లో చోటు చేసుకుంది. కొత్తపేట ఆంజనేయవాగు కొండ ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల రాచకొండ రిషి కస్తూరి సీతారామయ్య స్కూల్‌ రెండో తరగతి చదువుతున్నాడు. తండ్రి శివ, తల్లి చిన్ని చేపల మార్కెట్‌లో బట్టల వ్యాపారం చేస్తుంటారు. మంగళవారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన రిషి సాయంత్రం నాలుగు గంటలకు తోటి విద్యార్థులు, స్నేహితులతో కలిసి ఇంటికి బయలుదేరాడు. వాగు సెంటర్‌లోని బాలభక్త సమాజం మీదుగా కొండపై వాటర్‌ ట్యాంక్‌ వైపునకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో బాలభక్త సమాజం వద్దకు వచ్చేసరికి రోడ్డుపై కుక్కలు గుంపులుగా ఉండటంతో భయంతో ఓ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లసాగాడు. వెంటనే మూడు కుక్కలు గుంపుగా రిషిపై పడి తీవ్రంగా గాయపరిచాయి.

విరిగిన ముక్కు ఎముక..

కుక్కలు రిషి ముఖంపై కరవడంతో ముక్కు ఎముక విరిగిపోవడంతో పాటు ముఖంపై పలు చోట్ల గాయాలయ్యాయి. ఇంతలో స్థానికులు రిషిని కుక్కల బారి నుంచి కాపాడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు, స్థానికులు హుటాహుటిన రిషిని కొత్తపేటలో ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా, అక్కడి వైద్యులు బాలుడిని పరీక్షించి, కొత్త ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో రిషి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆటోలో కొత్త ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. వైద్యులు రిషిని పరీక్షించి ఆపరేషన్‌ చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement