కేబుల్ వైర్లకు మంటలు.. తప్పిన ముప్పు
మధురానగర్(విజయవాడసెంట్రల్): నిత్యం రద్దీగా ఉండే చుటుగుంట సిగ్నల్స్ వద్ద మంగళవారం మధ్యాహ్నం 3.10 గంటలకు విద్యుత్ స్తంభానికి కట్టి ఉన్న నెట్ కేబుళ్ల వద్ద మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు వ్యాపించటంతో విద్యుత్ ఫీడర్ ట్రిప్ అయ్యింది. సమాచారం అందుకున్న చుట్టుగుంట విద్యుత్ సబ్‌స్టేషన్ ఈఈ వెంకట్రావు సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం నీరు, ఇసుక, నిచ్చెనలు, గడకర్రలు తాళ్లు ఉపయోగించి మంటలను అదుపు చేసి, పాడైన ఇన్సులేటర్‌ను మార్చి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి విద్యుత్ సిబ్బంది మంటలు అదుపు చేసి, విద్యుత్ సరఫరా పునరుద్దరించారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేబుల్, నెట్‌వైర్లు విద్యుత్ స్తంభాల వద్ద చుట్టగా చుట్టి వదలివేయటం వల్ల అధిక వేడి వల్ల మంటలు వచ్చే ప్రమాదం ఉందని విద్యుత్ అధికారులు తెలిపారు.


