స్వచ్ఛమైన ఓటర్ల జాబితాకు సహకరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో బూత్ స్థాయి ఏజెంట్లను నియమించి స్వచ్ఛమైన ఓటర్ల జాబితాకు సహకరించాలని కలెక్టర్ డీకే బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించి భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పలు అంశాలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా తయారీలో బూత్‌స్థాయి అధికారులకు రాజకీయ పార్టీల బూత్‌స్థాయి ఏజెంట్ల సహకారం చాలా అవసరమన్నారు. ఏప్రిల్ నెలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఇందుకోసం ప్రతి రాజకీయ పార్టీకి చెందిన బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించాలన్నారు.
క్లయిమ్‌ల స్టేటస్ ఇది..
జిల్లాలో ఫారం–6, 7, 8 క్లయిమ్‌లకు సంబంధించి మొత్తం 76,176 అర్జీలు వచ్చాయని, అందులో 73,474 అర్జీలు పరిష్కరించామని కలెక్టర్ చెప్పారు. మిగిలిన 2,696 అర్జీలు పరిష్కరించాల్సి ఉందన్నారు. జిల్లాలో 1,769 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అందులో 32 పోలింగ్ కేంద్రాల స్థలాలను మార్చేందుకు ప్రతిపాదనలు చేశామన్నారు. 170 పోలింగ్ కేంద్రాలు పేరు మార్చాలని ప్రతిపాదించామన్నారు. అలాగే 73 కొత్త పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు పంపించామని వివరించారు. వీటితో మొత్తం 1,842 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీఆర్వో చంద్రశేఖరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు షేక్ సలార్‌దాదా, పంతం గజేంద్ర, కొడాలి శర్మ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ


