మామిడిపై పగమంచు | - | Sakshi
Sakshi News home page

మామిడిపై పగమంచు

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

మామిడ

మామిడిపై పగమంచు

మామిడిపై పగమంచు

ఏటా నష్టమే

మామిడి ఆశలపై ‘మంచు’ దెబ్బ ఆశిస్తున్న బూడిద, తేనె మంచు తెగుళ్లు తామరపురుగు దాడి రైతుల్లో ఆందోళన

మధురఫలం మామిడికి మంచు దెబ్బ తగిలింది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడం లేదు. ప్రస్తుతం మామిడి తోటలకు ఓ వైపు మంచు, మరో వైపు తెగుళ్ల ప్రభావంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఏడాది కష్టం నేలపాలయ్యే పరిస్థితి ఉండి.. దిగుబడి ఆశలు రాలిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

పెనుగంచిప్రోలు: మామిడి రైతుల ఆశలపై మంచుతెరలు కమ్ముకోవడంతో అవస్థలు తప్పడం లేదు. కొంతకాలం క్రితం వరకు మామిడి తోటలు పూతతో కళకళలాడాయి. దిగుబడి బాగుంటుందని, కష్టాలు తీరతాయని మామిడి రైతులు భావించారు. ఇంతలోనే నల్లతామర పురుగుకు తోడు తేనెమంచు పురుగు, బూడిద తెగులు ఆశించడం.. ప్రతికూల వాతావరణం ఎదురుకావడంతో పూతంతా మాడి పోయింది. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో సుమారు 57 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో తోటలు అధికంగా ఉన్నాయి. కృష్ణా నది, మునేరు, పాలేరు ఏరుల పరీవాహక ప్రాంతాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి.

పూతకు నష్టం

వాతావరణ పరిస్థితులు, మంచు ప్రభావానికి మామిడి పంటను చీడపీడలు, తెగుళ్లు ఆశిస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసంతో తేనె మంచు తెగులు, బూడిద తెగులు, తామర పురుగు విజృంభించి పూతకు నష్టం కలిగిస్తున్నాయి. తేనె మంచు పురుగు లేత ఆకులు, పూతపై చేరి రసం పీల్చుతుండటంతో ఎండిపోయి పూత రాలిపోతోందని రైతులు దిగులుపడుతున్నారు. ఇవి విడిచే జిగట పదార్థంతో నల్లబూజు ఏర్పడి పూత మాడిపోయినట్లు కనిపిస్తోంది.

బూడిద తెగులు

పూతపై తెల్లటి పౌడర్‌ లాంటి పొర ఏర్పడి క్రమంగా అది గోధుమ రంగులోకి మారి పూత ఎండిపోతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో చలి, పగటి పూట వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇది తీవ్రమవుతుంది. అకాల వర్షాలు, మంచు కురవడం, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో పూత మాడిపోయే అవకాశం ఉంటుంది.

ఒక్కొక్క రైతు పూత వచ్చిన నాటి నుంచి దాన్ని కాపాడుకోవటానికి 5 నుంచి 10 సార్లు రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. చివరిలో తామర పురుగు ఆశించటంతో చేసిన ప్రయత్నమంతా వృథా అవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మందులు కొట్టిన ప్రతిసారి ఎకరానికి రూ.3 వేల నుంచి రూ.5 వేలు ఖర్చు అవుతోందని రైతులు వాపోతున్నారు. ఏటా మామిడి పంటతో నష్టపోతున్నామని, ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు అంటున్నారు.

మామిడిపై పగమంచు1
1/1

మామిడిపై పగమంచు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement