తిరుపతమ్మ తిరునాళ్లకు విస్తృత ఏర్పాట్లు
భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ చిన్న తిరునాళ్ల మహోత్సవాలు మార్చి 4 నుంచి 8వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు నుంచి పసుపు, కుంకుమల బండ్లు రాక ప్రధాన ఘట్టంగా నిలవనుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. మునేరులో జల్లు స్నానాలు, పలు చోట్ల భక్తుల సౌకర్యార్థం చేతి పంపులు, శుద్ధి చేసిన తాగు నీటికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. పలుచోట్ల షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు.
మొదటి రోజు అఖండ జ్యోతి స్థాపనతో ప్రారంభం
చిన్న తిరునాళ్లలో మొదటి రోజు మార్చి 4న ఉదయం 6.19 గంటలకు అఖండజ్యోతి స్థాపనతో ఉత్సవాలు మొదలవుతాయి. నిత్య కల్యాణ మూర్తులకు అభిషేకం చేస్తారు.
రెండో రోజు గ్రామోత్సవం
తిరునాళ్లలో రెండో రోజు మార్చి 5వ తేదీ రాత్రి 7.02 గంటలకు ఉత్సవమూర్తుల రథోత్సవం (గ్రామోత్సవం) కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించనున్నారు.
మూడో రోజు దివ్య ప్రభోత్సవం
మూడో రోజు మార్చి 6వ తేదీ రాత్రి 10.02 గంటలకు దివ్య ప్రభోత్సవం వైభవంగా జరగనుంది. సుమారు 90 అడుగుల దివ్యప్రభపై ఉత్సవమూర్తులను ఉంచి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయిస్తారు.
నాలుగోరోజు అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమలు
చిన్న తిరునాళ్లలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమ బండ్లు నాలుగో రోజు మార్చి 6న అనిగండ్లపాడు గ్రామం నుంచి రాత్రి 7.32 గంటలకు ప్రారంభం కానున్నాయి. అమ్మవారి పుట్టింటి వంశీకులు కొల్లా శ్రీనివాసరావు ఇంటి నుంచి ఏటా పసుపు కుంకుమలు బండ్లపై తీసుకు రావడం ఆనవాయితీగా వస్తోంది. మార్చి 8న భక్తుల బోనాల సమర్పణతో చిన్న తిరునాళ్ల ఉత్సవాలు ముగుస్తాయి.
4 నుంచి ఉత్సవాలు ప్రారంభం
7న అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమ బండ్లు రాక
చిన్న తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రత్యేకంగా క్యూలైన్లు, బారికేడ్లు, ప్రసాదాల కౌంటర్లు, తదితర ఏర్పాట్లను ఆలయ ఇంజినీరింగ్ అధికారులు చేస్తున్నారు. మునేరులో షవర్‌బాత్‌లు, తలనీలాలు తీసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరగనున్నాయి. భక్తులతో పాటు గ్రామస్తులు, అధికారులు సహకరించి విజయవంతం చేయాలి. తిరునాళ్లలో ఆలయం వద్ద రాత్రి సమయంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. – బి.మహేశ్వరరెడ్డి, ఆలయ ఈఓ
తిరుపతమ్మ తిరునాళ్లకు విస్తృత ఏర్పాట్లు
తిరుపతమ్మ తిరునాళ్లకు విస్తృత ఏర్పాట్లు


