అర్జీలను సకాలంలో పరిష్కరించాలి
కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి అందే ‘మీ కోసం’ అర్జీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి సానుకూలంగా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ శ్రీదేవి, డీఎస్పీ శ్రీనివాసరావులతో కలసి మీకోసంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న జనాభా లెక్కల సేకరణను జిల్లా అధికార యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యతతో చేయాలన్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లుగా నియమించిన సిబ్బందికి ఎటువంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం కింద ఇకపై అర్జీదారులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చని వారికి ఆన్‌లైన్‌లోనే సమాధానం పంపుతారని తెలిపారు. ఆర్టీ జిల్లాస్థాయి నోడల్ అధి కారిగా డీఆర్వో వ్యవహరిస్తారన్నారు. ప్రజా సమాచార అధికారులు నిర్ణీత గడువు 30 రోజుల్లోగా సమాధానం అర్జీదారులకు పంపాలన్నారు. సత్యసాయి సేవా సమితి స్వచ్ఛందంగా ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఉచితంగా అల్పాహారం అందజేయడం అభినందనీయమన్నారు. మీకోసంలో 112 అర్జీలు స్వీకరించారు. తొలుత ఉద్యోగుల గ్రీవెన్స్ నిర్వహించి వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల నుంచి 25 అర్జీలు స్వీకరించారు.


