ముగిసిన మహిళా ఆర్చరీ ర్యాంకింగ్ టోర్నమెంట్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ కళాశాల ఆవరణలో జరుగుతున్న 3వ ఎన్‌టీపీసీ కేలో ఇండియా ఆర్చరీ నేషనల్ ర్యాంకింగ్ (మహిళల) టోర్నమెంట్ సోమవారం ముగిసింది. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో రికర్వ్, కాంపౌండ్ అంశాల్లో పోటీలు జరిగాయి. ఆది, సోమ వారాల్లో జరిగిన పోటీల్లో విజేతలకు సోమవారం బహుమతులను అందజేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి, విజయవాడ నగర పాలక సంస్థ స్పోర్ట్స్ కమిటీ మాజీ చైర్మన్ దోనేపూడి శంకర్, హైకోర్టు న్యాయవాదులు ఎన్.సాయి శంకర్, పి.రాజశేఖర్ విజేతలకు బహుమతులను అందజేశారు. చెరుకూరి ఓల్గా అర్చరీ అకాడమీ క్రీడాకారులు వి.స్ఫూర్తి సబ్‌జూనియర్ కాంపౌండ్ విభాగంలో బంగారు పతకం, కె.రుషికీర్తన జూనియర్ కాంపౌండ్ విభాగంలో రజత పతకం సాధించింది. ఏపీ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ 11 మంది టెక్నికల్ సిబ్బంది పర్యవేక్షణలో టోర్నమెంట్ జరిగిందన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను ఏపీ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.వెంకట రమణ, సంఘ సభ్యులు అభినందించారు.


