కనులపండువగా సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం సోమవారం కనులపండువగా జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో కల్యాణ వేదికపై కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉపాలయంలో ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం రాజగోపురం ఎదుట కల్యాణోత్సవం జరిగింది. దేవస్థానం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించగా, కమిటీ చైర్మన్ రాధాకృష్ణ కల్యాణంలో పాల్గొన్నారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న వారికి మేలు జరుగుతుందని, వివాహం కానివారికి వివాహం, సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని అర్చకులు పేర్కొన్నారు.
బస్టాండ్(విజయవాడ పశ్చిమ): రాష్ట్ర ప్రజా రవాణా సంస్థ (ఏపీ పీటీడీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎన్.బాలసుబ్రహ్మణ్యం ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీస్ ఆఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు డి.అంకినీడు, జోనల్, రీజనల్ నాయకులు సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. వారి వెంట సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు, అడిషనల్ జనరల్ సెక్రటరీ కొండారెడ్డి, రవి తదితరులు ఉన్నారు.
కనులపండువగా సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణం


