ప్రతిపక్ష నేతలపై దాడులు అమానుషం | - | Sakshi
Sakshi News home page

ప్రతిపక్ష నేతలపై దాడులు అమానుషం

Feb 23 2026 8:51 AM | Updated on Feb 23 2026 8:51 AM

ప్రతిపక్ష నేతలపై దాడులు అమానుషం

ప్రతిపక్ష నేతలపై దాడులు అమానుషం

ఇబ్రహీంపట్నం: వైఎస్సార్‌ సీపీకి చెందిన ప్రతిపక్ష నేతలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో దాడులు చేస్తోందని, ఇక సామాన్యుడికి న్యాయం ఏమి జరుగుతుందని శాసనసభ మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేష్‌ ఏమి చెప్పి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు ఏమి చేస్తున్నారని నిలదీశారు. ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో దెబ్బతిన జోగి రమేష్‌ ఇంటిని ఆదివారం ఆయన పరిశీలించారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో దాడులు, కక్షలు, కార్పణ్యాలతో రాష్ట్రం అట్టుడికి పోతోందన్నారు. అసలు ఈదాడులు ఏమిటని ప్రశ్నించారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూశాను గానీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న నాయకులపై దాడి చేయడం ఎప్పుడూ చూడలేదన్నారు. బలహీన వర్గాలపై చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇటువంటి దాడులు ప్రోత్సహిస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌, చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇతర నాయకులను టార్గెట్‌ చేసి కేసులు, దాడులతో హింసించడం దుర్మార్గమన్నారు. బలహీనవర్గాల్లో పుట్టాం కానీ తాము బలహీనులం కాదనే విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వ నాయకులు గుర్తించాలని అన్నారు. దాడి తర్వాత జోగి రమేష్‌ ధీరుడిగా ప్రజలు గుర్తించారని వెల్లడించారు.

పోలీస్‌ వ్యవస్థ ఏమి చేస్తోంది..

డైవర్షన్‌ పాలిటిక్స్‌కు అలవాటు పడిన కూటమి నాయకులు ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఛీ కొట్టే పరిస్థితులు ఉన్నాయని తమ్మినేని స్పష్టం చేశారు. దాడులన్నీ పోలీసుల సమక్షంలో చేస్తుంటే పోలీస్‌ వ్యవస్థ ఏమి చేస్తోందని ప్రశ్నించారు. సామాన్య ప్రజలకు ఏమి భరోసా ఇస్తారని మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ, డైవర్ట్‌ రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. కేసులకు భయపడే పరిస్థితులు వైఎస్సార్‌ సీపీ నాయకులకు లేదన్నారు. బంతి గోడకు కొడితే ఎంత స్పీడుగా వస్తుందో రానున్న రోజుల్లో రాష్ట్ర పాలన కూడా అలాగే జరుగుతుందని వెల్లడించారు. అన్నింటికి తెగించే ఉన్నామని స్పష్టం చేశారు. అంతకు ముందు కలింగ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డి.లక్ష్మణరావు, ఇంటిలెక్చువల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్లల రామకృష్ణ, రణస్థలం ఎంపీపీ పిన్నేటి సాయికుమార్‌, వైఎస్సార్‌ సీపీ సహాయ కార్యదర్శి గుమ్మడి రాంబాబు, మాజీ పీఏసీ చైర్మన్‌ చింతల సూర్యనారాయణ, కొండపల్లి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement