‘నా కుమార్తె మృతిపై అనుమానాలున్నాయి’ | - | Sakshi
Sakshi News home page

‘నా కుమార్తె మృతిపై అనుమానాలున్నాయి’

Feb 23 2026 8:51 AM | Updated on Feb 23 2026 8:51 AM

‘నా కుమార్తె మృతిపై అనుమానాలున్నాయి’

‘నా కుమార్తె మృతిపై అనుమానాలున్నాయి’

ఆర్డీఓతో విచారణ జరిపించాలి పీజీ దీపిక తండ్రి కోదండరామిరెడ్డి

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో పీజీ డాక్టర్‌ దీపిక మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, ఆమె తండ్రి బత్తుల కోదండిరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెంది 18 రోజులు గడిచినా నేటికీ మృతికి గల కారణాన్ని గుర్తించలేక పోవడం అనుమానాలకు తావిస్తోందని ఆయన తెలిపారు. ఆ రోజు డ్యూటీలో ఉండాల్సిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుష్మ లేకపోవడంపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆదివారం నగరంలోని ఓ ప్రైవేట్‌ హాలులో దీపిక తండ్రి కోదండి రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 5న తన కుమార్తె మృతిపై మాచవరం పోలీస్‌స్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైందన్నారు.

నేటి వరకూ మృతికి గల కారణం తెలియలేదన్నారు. సత్వరమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో స్పందించి రెవెన్యూ డివిజనల్‌ అధికారి స్థాయిలో జ్యూడిషియల్‌ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఉన్నతాధికారులందరి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. జీజీహెచ్‌లో 36 గంటల పాటు విధి నిర్వహణలో భాగంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సుష్మ డ్యూటీని కూడా తన కూతురే చేయాలని ఆదేశాన్ని ఇవ్వడంతో పై అధికారుల మాటను శిరసావహించిందన్నారు. డ్యూటీనే పరమావధిగా భావించే తన కూతురు డ్యూటీలో ఇబ్బందులు ఎదుర్కొని వైద్యం అందక కేవలం 20 నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవడం అంతుచిక్కని మిస్టరీగా ఉందన్నారు.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సుష్మవిధుల్లో లేరు..

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని, నష్ట పరిహారాన్ని ఇప్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పీజీ వైద్య విద్యార్థిని ఆపరేషన్‌ థియేటర్‌ లోనే డ్యూటీలో భాగంగా కుప్పకూలి మృత్యువాత పడితే కూడా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించకపోవడం చాలా దారుణమన్నారు. అసలు ఆ రోజు ఏమి జరిగిందో ముఖ్యమంత్రి సమగ్ర విచారణ జరిపించి దీపిక మృతిపై వీడని చిక్కుముడిని ప్రజలకు బహిర్గతం చేయాలని కోదండరాంరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆ రోజు నైట్‌ డ్యూటీలో ఎనస్తీషియా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుష్మ లేకపోవడం పలు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement