రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది
మాజీ మంత్రి మేరుగ నాగార్జున
చల్లపల్లి: రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని, అడ్డూ అదుపూలేకుండా దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత మేరుగ నాగార్జున అన్నారు. చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి నాయకులు అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల ఇళ్లపైకే వచ్చి గంటలు తరబడి దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. కనీసం ఆ దాడులను ఆపే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయకపోవటం పరోక్షంగా అరాచక శక్తులను ప్రోత్సహించటమేనని విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఏడు గంటలపాటు దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేయటం, జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేయటం అరాచక పాలనకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. అంబటి రాంబాబు సున్నిత మనస్కుడని ఆయన మాట్లాడే విధానం డ్రమటికల్‌గా ఉంటుందే తప్ప ఎవరినీ తూలి మాట్లాడరని పేర్కొన్నారు. అలాంటి అంబటి రాంబాబును కొట్టాలని, చంపాలని చూస్తున్నారని విమర్శించారు.
బాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత..
రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును గాలికొదిలేసి ప్రజామోదంలేని, వారికి ఉపయోగపడని ఒక డొల్ల బడ్జెట్‌ను తీసుకువచ్చారని మేరుగ దుయ్యబట్టారు. రాష్ట్ర, ప్రజల అభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్‌ను అందించిన ఘనత వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. కులం, మంతం, ప్రాంతం, పార్టీ అనే భేదాలు చూడకుండా సంక్షేమ పథకాలు అందరికీ అందించడం ఆయనకే చెల్లిందన్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని, ఎప్పుడెప్పుడు ప్రజానేత జగన్‌మోహన్‌రెడ్డికి పట్టం కడదామా అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. మేరుగ నాగార్జున వెంట వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బి.ఏడుకొండలు, చల్లపల్లి మండల నాయకులు యడ్ల జగదీష్, కొల్లూరి ముద్దుకృష్ణ, మద్దాల వీరాస్వామి, మెండు వీరబాబు, ఇతన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


