యనమలకుదురు వృషభాలకు మొదటి బహుమతి
పెనమలూరు: యనమలకుదురు గ్రామానికి చెందిన శ్రీఅనంతనేని కావ్య, శ్రీమధులకు చెందిన వృషభాలు బండలాగుడు పోటీలో ప్రథమ బహుమతి గెలిచాయి. నరసరావుపేటలో శనివారం జరిగిన జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి వృషభ రాజముల బండలాగుడు పోటీలో యనమలకుదురుకు చెందిన వృషభాలు ఆరు పళ్ల విభాగంలో 3765 అడుగులు బండలాగి ప్రథమస్థానం పొందాయి. మరో జత 3059 అడుగులు బండ లాగి నాల్గవ స్థానం వచ్చాయి. ఈ పోటీలో 12 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ మేరకు బహుమతి యజమాని అనంతనేని అజాద్ తీసుకున్నారు.
నేడు షాబుఖారి దర్గా
ఉరుసు ఉత్సవాలు ప్రారంభం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లిలోని హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 429వ ఉరుసు మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు దర్గా ప్రాంగణం శుద్ధి చేశారు. దర్గాతో పాటు బీ కాలనీ సెంటర్ నుంచి దర్గా వరకు విద్యుద్దీపాలంకరణ చేశారు. సోమవారం రాత్రి గుసుల్ ఉత్సవం, మంగళవారం గంధం మహోత్సవం, బుధవారం దీపారాధన వైభవంగా జరుపుతారు. గంధం ఊరేగింపు ఉత్సవాలకు హైలెట్‌గా నిలవనుంది. ఈ సందర్భంగా ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ రజా మాట్లాడుతూ ఉరుసు ఉత్సవాల్లో మూడు రోజుల పాటు కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొని బాబా వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఉత్సవాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
కృష్ణానదిలో పడి
వృద్ధుడు దుర్మరణం
కంచికచర్ల: కూలి పని కోసం వెళ్లిన ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి మృతిచెందిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామానికి చెందిన మాలాజీ నందియ్య(70) పొలం పని కోసం ఇంటి నుంచి వెళ్లగా ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలోని కృష్ణానదిలో పడిపోయాడని తెలిపారు. గమనించిన స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడని చెప్పారు. మృతునికి ముగ్గురు సంతానం ఉన్నారు. నందియ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడు సురేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
టిప్పర్ లారీ ఢీకొని
వృద్ధురాలు దుర్మరణం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): టిప్పర్ లారీ ఢీకొని వృద్ధురాలు దుర్మరణం చెందిన ఘటన కొండపల్లి ఖిల్లా రోడ్డులో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొండపల్లి ఖిల్లా రోడ్డుకు చెందిన కంపా సలోమి (66)వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. కొండపల్లికి చెందిన ఓ స్టోన్ క్రషర్ లారీ గ్రావెల్‌తో వెళుతూ నడుచుకుంటూ వెళ్తున్న సలోమిని ఢీకొట్టింది. ఆమె కిందపడిపోగా లారీ డ్రైవర్ గమనించకుండా వృద్ధురాలి మీదుగా లారీని పోనిచ్చి ఆగకుండా వెళ్లిపోయాడు. సమీపంలో వాహనదారులు వెంబడించి లారీ డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సలోమికి గతంలోనే భర్త మృతి చెందగా, కుమారుడి వద్ద ఉంటోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లారీ డ్రైవర్, లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వ్యభిచారం కేసులో మహిళ అరెస్ట్
గుణదల(విజయవాడ తూర్పు): పలువురు యువతుల సహకారంతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళను మాచవరం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాచవరం శాంతినగర్‌కు చెందిన వేముల రమణమ్మ తాను ఉంటున్న అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. నివాసాల మధ్య అసభ్యకరంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై గతంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా ఏర్పాటు చేసిన మాచవరం పోలీసులు దాడులు నిర్వహించగా ముగ్గురు యువతులతో పాటు బి.రాజు అనే విటుడు ఉన్నట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలు రమణమ్మను అరెస్ట్ చేశారు.
యనమలకుదురు వృషభాలకు మొదటి బహుమతి
యనమలకుదురు వృషభాలకు మొదటి బహుమతి


