న్యూ ఇయర్ వేడుకలు ఆహ్లాదంగా జరుపుకోండి
● ఆరోగ్యంగా, హాని రహితంగా చేసుకోవాలి ● ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖర్ బాబు
లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ డిసెంబర్ 31వ తేదీ రాత్రి నిర్వహించుకునే వేడుకలకు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంక్షలు విధించినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సహకరిస్తూ, వేడుకలను ఆహ్లాదంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
పలు సూచనలు
అర్ధరాత్రి రోడ్డు మీద వేడుకలకు అనుమతులు లేవని, అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడపవద్దని సీపీ హెచ్చరించారు. ట్రిపుల్ రైడింగ్‌పై్ కఠిన చర్యలు ఉంటాయని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, బీఆర్‌టీఎస్ రోడ్లపై పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లు (కొత్త, పాత) , కనక దుర్గా ఫ్లైఓవర్ లపై ట్రాఫిక్‌ను నిలిపివేస్తామన్నారు. గుంపులు గుంపులుగా చేరి నడి రోడ్డుపై కేకులు కోసి అల్లర్లు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రివేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరగవద్దని, హద్దు మీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం తాగి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీపీ హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ తీసివేసి అధిక శబ్దాలతో హోరెత్తించడం, అతి వేగంతో రోడ్లపై తిరగటం, వాహనాలు నడుపుతూ విన్యాసాలు ప్రదర్శించడం, బాణసంచా పేల్చడం వంటి వాటివలన ప్రశాంతతకు భంగం కలిగి వృద్ధులకు, చిన్న పిల్లలకు, రోగులకు ఇబ్బంది కలుగుతుందని, అలాంటి వాటికి పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
రోడ్డు ప్రమాదాలకు లోనుకాకుండా, ఇతరులను గురిచేయకుండా సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.


