త్రిముఖ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ
పటమట(విజయవాడతూర్పు): త్రిముఖ ట్రైలర్‌కు పాన్ ఇండియా వ్యాప్తంగా విశేష ఆదరణ వచ్చిందని మూవీ యూనిట్ పేర్కొంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం చిత్ర యూనిట్ విజయవాడ విచ్చేసింది. ఈ సందర్భంగా విజయవాడ బందర్ రోడ్డులోని ఓ హోటల్‌లో మూవీ యూనిట్ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. త్రిముఖ మూవీ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా అందరినీ ఆకట్టుకుంటుందని ప్రొడ్యూసర్ మద్దాలి సత్య శ్రీదేవి అన్నారు. ఈ సినిమాలో ఏసీపీ శ్రీవాణి పాత్రలో సన్నీలియోన్ నటన విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు. చిత్ర దర్శకుడు రాజేశ్వర్ మాట్లాడుతూ తన తొలి చిత్రం కావడంతో అందరూ నచ్చే కథాంశంతో తీశానని, చిత్రంలో అందరూ కొత్త వారు అయినప్పటికీ నటనలో విశేష ప్రతిభ కనబరిచారని చెప్పారు. హీరో యోగేష్ మాట్లాడుతూ త్రిముఖ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు. జెమినీ సురేష్ మాట్లాడుతూ సినిమాని అందరూ ఆదరించాలని కోరారు. అకిరా డ్రిమ్ క్రియేషన్స్‌లో యోగేష్ హీరోగా, ఆకృతి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం జనవరి 2న విడుదల అవుతోందని తెలిపారు.
పిచ్చికుక్క స్వైరవిహారం
తొమ్మిది మందికి గాయాలు
చల్లపల్లి: పిచ్చికుక్క స్వైరవిహారం చేయటంతో పలువురు గాయాలపాలైన ఘటన మండల పరిధిలోని లక్ష్మీపురం, చింతలమడ గ్రామాల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఒక పిచ్చికుక్క శనివారం నుంచి లక్ష్మీపురం, చింతలమడ గ్రామాల్లో సంచరిస్తూ కనిపించినవారినల్లా కరిచి గాయపరిచింది. శనివారం ఐదుగురిని కరవగా ఆదివారం మరో నలుగురిని కరిచింది. దీంతో మొత్తం పిచ్చికుక్క కాట్లకు గురైన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. విజయవాడకు చెందిన అంకినీడు ప్రసాద్ చుట్టపుచూపుగా లక్ష్మీపురం రాగా ఆదివారం అతనిని, లక్ష్మీపురం గ్రామానికి చెందిన జయంపాటి శ్రీదేవిని, చింతలమడకు చెందిన సుదాని విష్ణుమూర్తితో పాటు మరొకరిని కరిచింది. వీరమాచినేని అంకినీడు ప్రసాద్ కాలుకు తీవ్రగాయం కాగా తొలుత చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఆదివారం అక్కడ సివిల్ సర్జన్ లేకపోవటంతో విజయవాడ వెళ్లిపోయాడు. జయంపాటి శ్రీదేవి, సుదాని విష్ణుమూర్తి ప్రస్తుతం చల్లపల్లి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
కేబీఎన్ సేవలు అపూర్వం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విద్యాభివృద్ధికి కేబీఎన్ కళాశాల గడిచిన 60 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలు అపూర్వమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కేబీఎన్ కళాశాల పూర్వవిద్యార్థుల సమ్మేళనం (కోసా) ఆదివారం ఆ కళాశాల ప్రాంగణంలో అత్యంత వేడుకగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శివనాథ్ మాట్లాడుతూ చంద్రయాన్ ప్రయోగంలో కీలకమైన విడిభాగాలు తయారుచేసిన బీఎన్‌రెడ్డి వంటి ప్రముఖుల ద్వారా కాలేజీ కీర్తి ఖండాంతరాలు దాటి వ్యాపించిందన్నారు. మరో మూడు నెలల్లో కాలేజీలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పోతిన మహేష్ మాట్లాడుతూ కేబీఎన్ కళాశాలలో తాను ఎనిమిదేళ్లు అధ్యాపకునిగా పని చేశానన్నారు. టాలీవుడ్ నటుడు, కాలేజీ పూర్వవిద్యార్థి సుహాస్ మాట్లాడుతూ కేబీఎన్ కాలేజీ నేర్పించిన క్రమశిక్షణ, చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే సినీ రంగంలో తాను నిలదొక్కుకోవటం సాధ్యమైందన్నారు.
సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి జేఎసీఎస్‌రావు, మాజీ డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్, సీనియర్ న్యాయవాది నరహరిశెట్టి శ్రీహరి, హిందూ హైస్కూల్స్ కమిటీ జనరల్ సెక్రటరీ గోపిశెట్టి మల్లయ్య తదితరులు మాట్లాడారు. కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు ఉసిరిక ఉమామహేశ్వరరావు, తూనికుంట్ల శ్రీనివాసు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి ఏవో డాక్టర్ వి.నారాయణరావు ఉపాధ్యక్షుడు చిట్టూరి నాగేంద్ర, పూర్వ విద్యార్థి ప్రముఖులు రమేష్ బాబు (సీఈఓ, సి ఛానెల్), డాక్టర్ ఆర్‌కే అయోధ్య (ప్రముఖ సైకాలజిస్ట్), నందిపాటి శ్రీనివాసరావు (ప్రముఖ న్యాయవాది) తదితరులు పాల్గొన్నారు.
త్రిముఖ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ
త్రిముఖ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ


