చిత్రం.. భళారే విచిత్రం
విజయవాడ కల్చరల్: ఏపీ సృజనాత్మక సమితి, తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య ఆధ్వర్యాన పున్నమ్మ తోటలోని దూరదర్శన్, టీటీడీ కల్యాణమండపం రోడ్డులో నిర్వహించిన చిత్ర కళాప్రదర్శన ఆకట్టుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిత్రకారులు వారి చిత్రాలను ప్రదర్శించారు. 200 స్టాల్స్‌లో ప్రదర్శించిన చిత్రాలు కనువిందు చేశాయి. ఆధునిక చిత్రకళ ఉట్టిపడేలా గ్రామీణ జీవనం, రైతులు, ప్రకృతి సౌందర్యం, పల్లెజీవితం, జాతీయ నాయకులు, దేవతా మూర్తులు తదితర అంశాలతో కూడిన చిత్రాలను ప్రదర్శించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన చిత్ర కళాప్రదర్శన రాత్రి 9 గంటలవరకు సాగింది. ప్రపంచ తెలుగు చిత్రకళా సమాఖ్య అధ్యక్షుడు పీరన్, కార్యదర్శి బాలయోగి, టి.వెంకటర్రావ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించడానికే..
ప్రజలకు అవగాహన కల్పించాలనే ఆశయంతో చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు పీరన్ తెలిపారు. బాల చిత్రకారులకు ఇటువంటి వేదికలు అవసరమన్నారు. అమరావతి కేంద్రంగా కళాకారుల ప్రదర్శనకు ఆడిటోరియం నిర్మించాలని సూచించారు. నిర్వాహకులు శిబిరంలో పాల్గొన్న చిత్రకారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.


