బందరులో పందెంకోళ్ల కూతలు
●రంగు, వాటాన్ని బట్టి పందెంపుంజుల కొనుగోళ్లు
●రూ.10 వేల నుంచి రూ.30 వేల ధర పలుకుతున్న పుంజులు
కోనేరుసెంటర్ (మచిలీపట్నం): కృష్ణా జిల్లా కేంద్రమైన బందరులో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగకు నెల ముందునుంచే హడావుడి కనిపిస్తోంది. ప్రధానంగా పందెంకోళ్ల కూతలు విన్పిస్తున్నాయి. పందెంరాయుళ్లు పుంజుల కొనుగోలుకు గాలిస్తున్నారు. కిందటేడాది కాకిడేగ మైలాను మట్టి కరిపించిందని ఒకరంటే.. నీ కాకిడేగ మైలానే కొట్టింది నా నెమలి అయితే పర్లాను పరుగులు పెట్టించింది గుర్తుందా.. అంటూ మాట్లాడుకుంటున్నారు. ఏ రంగుకు ఏ రంగు కోడి కలపాలి, ఏ సమయంలో పందెం వేయాలి, ఎప్పుడు కత్తి కట్టి వదలాలి, ఏది గెలుస్తుంది, ఏది ఓడిపోతుందనే చర్చలు సాగుతున్నాయి. పందెంకోడి కూత వినబడితే చటుక్కున ఆగి పెంపకందారులతో బేరసారాలు ఆడుతున్నారు. రంగును బట్టి ధర నిర్ణయించి అడ్వాన్స్‌లు ఇచ్చేస్తున్నారు. పుంజు రంగు, వాటం, కాలు విసిరే విధానం నచ్చితే.. రేటు గురించి కూడా ఆలోచించడంలేదు. కాకి, పచ్చకాకి, డేగ, కాకిడేగ, అబ్రాస్, నెమలి, సీతువా, రసంగి, పర్లా, పింగళా, కక్కిరి, మైలా, ఎర్రబొట్ల సీతువా.. ఇలా రంగులను బట్టి పుంజు జాతి గలది అయితే ఒక్కో కోడిని రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ధరకు కొనేస్తున్నారు. పలువురు పందెంకోళ్లను జీడిపప్పు, పిస్తా, కోడిగుడ్లు, కీమా వంటి ఖరీదైన మేతలతో యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు.
సండే మార్కెట్‌లో సందడి..
సంక్రాంతి దగ్గర పడుతుండటంతో బందరు సండే మార్కెట్‌లో పందెంరాయుళ్ల సందడి పెరిగింది. మిగిలిన రోజుల్లో కూర కోళ్లకు మాత్రమే గిరాకీ ఉండగా ప్రస్తుతం పందెంపుంజుల కూతలు విన్పిస్తున్నాయి. దీంతో పందెంరాయుళ్లు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే పుంజుల కోసం సండే మార్కెట్‌కు చేరుకుంటున్నారు. సండే మార్కెట్‌లో ఓ మాదిరి పందేలు వేసుకునే వారికి అనుకూలంగా రూ.3 వేల నుంచి రూ.7 వేల వరకు ధర పలికే పుంజులు అమ్మకానికి వస్తున్నాయి. ఈసారి సంక్రాంతికి ఈ ప్రాంతంలో కోడిపందేలు పెద్ద ఎత్తున జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్ష విరమనలు దిగ్విజయంగా జరుగుతున్నాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. దీక్ష విరమణలపై ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్‌డీ ప్రసాద్ వేద పండితులు షణ్ముఖేశ శాస్త్రి, అర్చకులు యూ మురళీధర శాస్త్రిలు మాట్లాడారు. దేవదాయ శాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులందరూ సమన్వయంతో పని చేస్తూ భవానీలకు అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారన్నారు. 9 మందితో ప్రారంభమైన భవానీ దీక్షలు నేడు లక్షలాది మంది దీక్షలు స్వీకరించే స్థాయికి చేరిందన్నారు. భవానీలకు వీలైనంత అధిక సమయం దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. దీక్ష విరమణలన్నీ శాసీ్త్రయంగానే సమర్పిస్తున్నామని చెప్పారు.
బందరులో పందెంకోళ్ల కూతలు


