డయేరియాపై అప్రమత్తం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగర పాలక సంస్థ సరఫరా చేసే నీరు తాగడంతో పాత రాజరాజేశ్వరిపేటలో పలువురు డయేరియా బారిన పడినట్లు వచ్చిన సమాచారం మేరకు వైద్యశాఖ అప్రమత్తమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఎపిడమిక్ బృందంతో ఆ ప్రాంతానికి చేరుకుని డయారియా కేసులపై ఆరా తీశారు. వీఎంసీ, సచివాలయ సిబ్బందితో కలిసి డయేరియా సోకినట్లు సమాచారం వచ్చిన ప్రాంతంలో ఇంటింటి సర్వేచేశారు. దీంతో సుబ్బరాజు ఫ్లాట్స్‌లోని ఒక 26 ఏళ్ల మహిళ అక్యూట్ డయేరియల్ డిసీస్ (డయేరియా) స్వల్ప లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఆమెతో పాటు, మరో ముగ్గురికి స్వల్పంగా లూజ్ మోషన్స్ అయినట్లు వైద్యశాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వారు కోలుకున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు.
పాత రాజరాజేశ్వరిపేటలో
వైద్య బృందాల సర్వే
ఆ ప్రాంతంలోని మంచినీటి కుళాయిల నుంచి మురుగు నీరు వస్తోందని స్థానికులు చెప్పడంతో, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, అవకాశం ఉంటే ఆర్‌ఓ వాటర్ తాగాలని డీఎంహెచ్‌ఓ సుహాసిని సూచించారు. 14 వైద్య బృందాలతో డయేరియా కేసులు గుర్తించేందుకు సర్వే చేశామన్నారు. అలా 1234 ఇళ్లు, 3,745 మంది జనాభాను కవర్ చేస్తూ రాపిడ్ సర్వే చేసినట్లు తెలిపారు. వైద్య బృందాలు ఆ ప్రాంతంలోని అన్ని ఇళ్లకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్స్, జింక్ మాత్రలు పంపిణీ చేసినట్లు చెప్పారు. వీఎంసీ శానిటేషన్ పనులు, క్లోరినేషన్‌ను బలోపేతం చేయాలని ఆదేశించారు. ఆ ప్రాంతంలో సేకరించిన నీటి నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. రోజువారీ సర్వే, శానిటేషన్ పర్యవేక్షణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఈ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉన్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు.


