పరిశ్రమల స్థాపనకు తక్షణ అనుమతులు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ యువతకు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. సమావేశంలో అజెండా అంశాలు, పెండింగ్ దరఖాస్తుల పురోగతి, సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులన్నీ సింగిల్ విండో పద్ధతిలో తక్షణ అనుమతులు మంజూరు చేస్తామన్నారు. పరిశ్రమలు పెట్టిన వారికి వివిధ ప్రభుత్వ రాయితీలు కల్పిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పెండింగ్ ఉండకూడదు..
బ్యాంకుల వద్ద పెండింగ్‌లో ఉన్న పీఎం విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్(పీఎంఈజీపీ) పథకాల దరఖాస్తులను తక్షణం పరిష్కరించి రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ చెప్పారు. అదేవిధంగా యూనిట్లు కూడా గ్రౌండ్ అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పీఎంఈజీపీ పథకం కింద వచ్చిన 120 దరఖాస్తులకు గానూ కేవలం 30 మంది లబ్ధిదారులకు మాత్రమే రుణాలు మంజూరు చేశారని, వచ్చే సమావేశం నాటికి అవి పెండింగ్లో ఉండకూడదని బ్యాంక్ అధికారులకు చెప్పారు. పరిశ్రమల ఏర్పాట్లలో మౌలిక వసతులకు సంబంధించి ఆయా డిపార్ట్‌మెంట్ల వద్దకు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్ వెంకట్రావు, అగ్నిమాపక శాఖ అధికారి ఏసురత్నం, మార్కెటింగ్ శాఖ ఏడీ ఎల్. నిత్యానంద్, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, జిల్లా పంచాయతీ, డీఆర్‌డీఏ, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ


