‘తూర్పు’లో 95వేలకు పైగా సంతకాల సేకరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ వైద్య కళాశాలలు పీపీపీ పేరుతో ప్రైవేటుకు అప్పగించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల్లో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 95 వేలకు పైగా సంతకాలు సేకరించినట్లు ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్ తెలిపారు. విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఇచ్చిన గడువుకి పది రోజుల ముందుగానే రాష్ట్రంలోనే అత్యధికంగా 95 వేలకు పైగా సంతకాలు సేకరించినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అంటూ ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసినట్లు ఆయన చెప్పారు. విద్యార్థులు, యువతతో పాటు, గత ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసిన వాళ్లు సైతం వైద్య కళాశాలల విషయంతో తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సంతకాలు చేసినట్లు అవినాష్ తెలిపారు. వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలనేది ప్రజల ఆకాంక్షగా ఈ సంతకాల సేకరణ ద్వారా తెలియజేశారన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్య విద్య, వైద్యం అందాలంటే ప్రభుత్వమే వైద్య కళాశాలలు నిర్వహించాలని ఆయన తెలిపారు.
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా
అధ్యక్షుడు దేవినేని అవినాష్


