నాగసూరికి జ్ఞానజ్యోతి పురస్కారం
విజయవాడ కల్చరల్: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో బందరు రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో శనివారం విఖ్యాత రచయిత, కాలమిస్ట్ నాగసూరి వేణుగోపాల్‌కు 2025 సంవత్సరానికి గానూ జ్ఞాన జ్యోతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ సి. భవానీ దేవి మాట్లాడుతూ నాగసూరి నడిచే గ్రంథాలయమని అభివర్ణించారు. ఆకాశవాణిలో వివిధ హోదాలో పనిచేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పురస్కార గ్రహీత నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ తనకు ప్రేరణ కలిగించిన అంశాలను వివరించారు. రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఉపాధ్యక్షుడు ఎ. జయ ప్రకాష్, సభ్యులు పాల్గొన్నారు.


