నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన వై. అశోక్‌కుమార్‌రెడ్డి కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని అందజేసింది. సికింద్రాబాద్ తార్నాకకు చెందిన డి. ప్రభాకర్‌రెడ్డి కుటుంబం ఆలయ అధికారిని కలిసి, సుమతి ప్రభాకర్‌రెడ్డి పేరిట నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ వారి అర్ధమండల దీక్షలు 21వ తేదీ శుక్రవారం ప్రారంభం కానున్నాయని ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. 25వ తేదీ మంగళవారం వరకు భక్తులు స్వీకరించేలా ఆలయ ప్రాంగ ణంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీక్షలు స్వీకరించే భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద దీక్షలు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కామథేను అమ్మవారి ఆలయంతో పాటు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద దీక్షలను ఆలయ అర్చకులు చేతుల మీదుగా స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఇక డిసెంబర్ 4వ తేదీ మార్గశిర పౌర్ణమి కలశజ్యోతి ఉత్సవం నిర్వహిస్తామన్నారు. సత్యనారాయణపురంలోని శ్రీశివరామకృష్ణ క్షేత్రం నుంచి సాయంత్రం 6.30గంటలకు ప్రత్యేక వాహనంపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కలశజ్యోతులతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారని పేర్కొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): విదేశీయుల భద్రత దృష్ట్యా, వారి గోప్యతకు భంగం కలుగకుండా పటిష్టమైన నిఘా ఉంచాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు పోలీసు అధికారులకు సూచించారు. ఇమిగ్రేషన్ విసా ఫార్నర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్‌పై శనివారం సమీక్ష సమావేశం జరిగింది. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐవీఎఫ్‌ఆర్‌టీ విభాగం, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ ప్రతి నెల మూడో శనివారం ఈ అంశంపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు పర్యటన నిమిత్తం వచ్చే విదేశీయులు ఏ హోటల్స్‌లో ఉంటున్నారు అనే విషయాలను ఆయా హోటల్స్ వారు తప్పనిసరిగా సంబంధిత పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలన్నారు. చదువు నిమిత్తం వచ్చే వారి వివరాలను సంబంధిత విద్యాసంస్థలు కూడా తప్పనిసరిగా ఆ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. అడ్మిన్ డీసీపీ కేజీవీ సరిత, రూరల్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని మూలపాడు వద్ద ఏర్పాటు చేస్తున్న జిప్ లైన్ పర్యాటక ప్రియులకు అందుబాటులోకి రానుంది. రెండు కొండల మధ్య సుమారు 360 మీటర్ల పొడవున రెండు జిప్ లైన్లను సిద్ధం చేశారు. గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యింది. ప్రస్తుతం సేఫ్టీ ఆడిట్, ట్రయల్ రన్ జరుగుతున్నాయి. డిసెంబర్ ఒకటి నాటికి పర్యాటకులు దీనిని వినియోగించుకోవచ్చని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సతీష్ తెలిపారు. జిప్ లైన్ ద్వారా రెండు కొండల మధ్య నుంచి ప్రయాణం చేయటం పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.


