పర్యావరణ పరిరక్షణకు కృషి చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): పరిసరాలను శుభ్రం చేసి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం కలెక్టరేట్ ఆవరణలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు వివిధ ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని కలెక్టరేట్ ప్రాంగణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పిచ్చిమొక్కలు, చెత్తను తొలగించి శుభ్రం చేశారు. పనికిరాని పాత కంప్యూటర్లు, పేపర్లు, ఇతర అనవసర వస్తువులు తొలగించి కార్యాలయాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాలు నిర్వహించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి అందరూ కృషి చేయాలన్నారు.
సైకిల్‌పై వచ్చిన కలెక్టర్..
శనివారం కలెక్టర్ డీకే బాలాజీ విధులకు సైకిల్‌పై వచ్చి హాజరయ్యారు. కలెక్టర్ బంగ్లా నుంచి కలెక్టరేట్ వరకు ఆయన సైకిల్‌పై వచ్చారు. డీఆర్వో చంద్రశేఖరరావు, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, డెప్యూటీ సీఈవో ఆనంద్‌కుమార్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ షేక్ షాహిద్‌బాబు, గిరిజన సంక్షేమ అధికారి ఫణిధూర్జటి తదితరులు పాల్గొన్నారు.
చల్లపల్లి టు కలెక్టరేట్..
చిలకలపూడి(మచిలీపట్నం): స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటంతో పాటు శబ్ద, వాయు కాలుష్య రహిత సమాజం కోసం వాహనాలను వినియోగించకుండా నడక, సైకిల్‌పై రావాలని కలెక్టర్ గత మూడు వారాలుగా ఉద్యోగులు, ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ప్రతి రోజూ చల్లపల్లి నుంచి తన బైక్‌పై విధులకు హాజరయ్యే డీఆర్వో సీసీ తూము వెంకటేశ్వరరావు కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం చల్లపల్లి నుంచి సైకిల్‌పై కలెక్టరేట్‌కు విధులకు హాజరయ్యేందుకు వచ్చారు. ఆయన సైకిల్‌పై రావటంపై డీఆర్వో కె.చంద్రశేఖరరావుతో పాటు కలెక్టరేట్ ఉద్యోగులు ప్రశంసించారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయండి


