పేరు మార్చి.. ఏమార్చారు
ఆటో కార్మికులను దారుణంగా మోసం చేశారు ఇఫ్టూ అధ్యక్షుడు దాది శ్రీనివాసరావు మండిపాటు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చంద్రబాబు సర్కార్ వాహనమిత్ర పేరు మార్చి.. ఆటో డ్రైవర్ సేవలో పథకం పెట్టి కార్మికులందరినీ మోసం చేసిందని ఇఫ్టూ అధ్యక్షుడు దాది శ్రీనివాసరావు విమర్శించారు. ఎన్నికల ముందు ఆటో కార్మికులకు 5 హామీలు ఇచ్చి విస్మరించిందన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని శనివారం ప్రగతి శీల ఆటో కార్మిక సంఘం(ఇఫ్టూ)ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నా జరిగింది. ధర్నాలో ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాను ఉద్దేశించి దాది శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో కార్మికులందరికీ రూ.15వేలు ఆర్థిక సహాయం చేస్తాం, జీవో 21ను రద్దు చేస్తాం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం వంటి హామీలను ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా హామీలను అమలు చేయలేదన్నారు. దసరా కానుకగా ఆటో డ్రైవర్ సేవలో పథకంలో అరకొరగా రూ.15వేలు ఆర్థిక సహాయం అందించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8లక్షల మందికి పైగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఉంటే కేవలం 2.90లక్షల మందికి మాత్రమే ఆర్థిక సహాయం అందించి చేతులు దులుపుకొందన్నారు. ఆటో కార్మికులను చంద్రబాబు ప్రభుత్వం పచ్చి దగా చేసిందన్నారు. ఒక్కో ఆటోకు రూ. 30 నుంచి 40వేల వరకు పెనాల్టీలు వేస్తున్నారన్నారు. పెనాల్టీలకు సంబంధించిన జీవో 21ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారు?
ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. పోలారి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం 18 నెలల కాలంలో రూ.2.2 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. లక్షల కోట్ల అప్పులు ఎటుపోతున్నాయో అర్థం కావడం లేదన్నారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి నిధులు లేవంటున్న చంద్రబాబు కార్పొరేట్లకు వేల ఎకరాలు భూములను, విద్యుత్ ఇతర టాక్స్‌లను వేలకోట్లు రాయితీలుగా దోచి పెడుతున్నారని విమర్శించారు. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకులు ముని శంకర్, సీహెచ్ పెద్దిరాజు, పి.రఫీ ఖాన్, డి. శ్రీధర్ బాబు, వై. అప్పారావు, సూరిబాబు, వలీ తదితరులు పాల్గొన్నారు.


