
చిన్నారులకు సోకింది సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షనే!
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
పెనుగంచిప్రోలు: గ్రామంలోని చిన్నారులకు సోకిన వైరల్ ఇన్‌ఫెక్షన్ సామాన్యమైనదేనని, ఆందోళన అవసరం లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. చిన్నారులకు వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకిందన్న సమాచారం తెలిసిన వెంటనే వైద్య బృందాలను పంపి, ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యం చేయించామని, వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేసి నమూనాలు సేకరించారని వివరించారు. గ్రామంలో వైరల్ ఇఫెక్షన్‌తో కాళ్లు, చేతులపై బొబ్బలు వచ్చిన చిట్టిమళ్ల గోపి కుమార్త్తెలు విషిత, గీతాసమస్రతో పాటు వారి పొరుగున ఉండే మరో చిన్నారి గానవిని వారి ఇంటి వద్దకు కలెక్టర్ లక్ష్మీశ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసినితో కలసి వెళ్లి పలకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకిన చిన్నారుల్లో ఇద్దరికి వెంటనే తగ్గిపోయిందన్నారు. గీతాసహస్రకు విజయవాడ జీజీహెచ్‌లో పరీక్షలు చేసి వైద్య సేవలు అందించామని, ఆమె కూడా ప్రస్తుతం ఇంటి వద్ద ఆరోగ్యంగా ఉందని తెలిపారు. అనంతరం గ్రామంలోని ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను పరిశీలించి, తాగునీటిలో క్లోరినేషన్ శాతాన్ని తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడి, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, ఎంపీడీఓ జి.శ్రీను, పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.