
పీలిస్తే.. ప్రాణాంతకమే!
● టైప్–2 డయాబెటిస్ వచ్చే అవకాశం
●ఇప్పటికే వ్యాధితో ఉన్న వారికి మరింత ప్రమాదం
●మెదడుపై తీవ్ర ప్రభావం
●డిప్రెషన్, మతిమరుపు,
పార్కిన్‌సన్స్ సమస్యలు
●తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
పోరంకికి చెందిన 35 ఏళ్ల రాజేష్ గాంధీనగర్‌లోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తుంటారు. నిత్యం ద్విచక్రవాహనంపై విధులకు వస్తుంటారు. ఇటీవల నీరసంగా ఉండటంతో పరీక్ష చేయించుకుంటే సుగర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అతనికి ఫ్యామిలీ హిస్టరీ కూడా లేకపోవడంతో కాలుష్యమే కారణమై ఉంటుందంటుని వైద్యులు చెబుతున్నారు.
లబ్బీపేటకు చెందిన 42 ఏళ్ల ఒస్మాన్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తుంటారు. విధి నిర్వహణలో భాగంగా నిత్యం సిటీలో బైక్‌పై తిరుగుతుంటారు. ఇటీవల వాసన గ్రహించలేక పోవడంతో పాటు డిప్రెషన్‌కు లోనవుతున్నాడు. దీనికీ కాలుష్య ప్రభావమే కారణమని నిపుణులు వివరిస్తున్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకూ పెరుగుతోంది. కాలం చెల్లిన వాహనాలు సైతం రోడ్లపై పరుగులు పెడు తూ టన్నుల కొద్దీ కాలుష్యాన్ని ప్రజలపైకి వదులుతున్నాయి. ఏ రోడ్డు చూసినా వందలాది వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. అలాంటి రోడ్లపై నిత్యం ద్విచక్రవాహనాలపై తిరిగే వారు వాయు కాలుష్యం కారణంగా పలు వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వాయు కాలుష్యంతో డయాబెటిస్‌కు దారి తీస్తున్నట్లు ఢిల్లీ, చైన్నెలలో నిర్వహించిన పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రధాన సమస్యలివే..
● కాలుష్య ప్రభావంతో మతిమరుపు వచ్చే అవకాశం ఉంది.
● వాయు కాలుష్యంతో పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉంది.
● వాసన గ్రహించలేక ఇబ్బంది పడతారు.
● పార్కిన్‌సన్స్(వణుకుడు రోగం), డిప్రెషన్‌కు గురికావచ్చు.
● ఫిట్స్, మైగ్రేన్ తలనొప్పి వంటివి రావచ్చు.
● ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది.
ఇలా నివారించవచ్చు..
● ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్‌తో పాటు సర్జికల్ మాస్క్ లాంటివి పెట్టుకుంటే మంచిది.
● వీలైనంత వరకూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ (బస్సులు)ను వినియోగిస్తే కాలుష్యం బారిన పడకుండా కొంత వరకూ తగ్గించుకోవచ్చు.
● కాలం చెల్లిన బస్సులు, ఇతర వాహనాల వినియోగాన్ని నివారించాలి.
● ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై దృష్టి సారించాలి.
● రోడ్ల వెంట విరివిగా మొక్కలు నాటితే కాలుష్య ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తాయి.
విజయవాడలో ట్రాఫిక్ కారణంగా రోడ్లపై పొగ కమ్మేసిన దృశ్యం
ఇలా అనేక మంది వాయు కాలుష్యం కారణంగా మధుమేహంతో పాటు, మెదడు సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. కొత్తగా మధుమేహం బారిన పడటమే కాకుండా, ఇప్పటికే వ్యాధితో ఉన్న వారు కాలుష్య ప్రభావానికి గురైతే, మధుమేహం అదుపులో ఉండని పరిస్థితి తలెత్తుతోందని నిపుణులు చెబుతున్నారు.