
ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ
చిలకలపూడి(మచిలీపట్నం): మహిళల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. ప్రభుత్వ వైద్యకళాశాల, సర్వజన ఆస్పత్రి సంయుక్త ఆధ్వ ర్యంలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని ఆయన సోమవారం వీడియోకాన్ఫరెన్స్ హాలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు ఆల్ట్రాసౌండ్, మామో గ్రామ్ వంటి పరీక్షల కోసం రూ.వేలు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. కలెక్టరేట్‌లో ఉచితంగా ఈ పరీక్షలు చేస్తామని తెలిపారు. ఈ వైద్య పరీక్షలు ప్రతి సోమవారం, గురువారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేస్తా రని పేర్కొన్నారు. ప్రతి మంగళ, శుక్రవారం క్షేత్రస్థాయిలో సంచార వాహనం ద్వారా వైద్య పరీక్షలు చేస్తారని వివరించారు. పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను రహస్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఏఓ రాధిక, వైద్యులు బి.పద్మావతి, ఇంద్రజ, రేడియాలజిస్ట్ అంజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.