
ఎరువుల షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు
12.64టన్నుల ఎరువులు సీజ్
కోడూరు: మండలంలోని ఎరువుల షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి, భారీ మొత్తంలో ఎరువులను సీజ్ చేశారు. మండలంలోని ఎరువులు, పురుగు మందుల షాపులపై జిల్లా విజిలెన్స్ అధికారులు మంగళవారం సాయంత్రం దాడులు జరిపారు. ప్రధాన సెంటర్‌లోని రెండు షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 12.64 టన్నుల ఎరువులకు ఏవిధమైన బిల్లులు లేనట్లుగా అధికారులు గుర్తించారు. షాపుల యాజమానులు ఈ ఎరువులకు సంబంధించి స్టాక్ రిజిస్ట్రార్‌లో నమోదు చేయకపోవడం, ఈ–పోస్ యంత్రంలో ఆన్‌లైన్ చేయకపోవడాన్ని గుర్తించారు. సీజ్ చేసిన ఎరువుల విలువ సుమారు రూ.2.04లక్షలు ఉంటుందని విజిలెన్స్ అధికారి వి.కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ రెండు ఎరువుల దుకాణాలపై 6ఏ కేసులు నమోదు చేయడంతో పాటు ఈ–పోస్ యంత్రాలు, ఎరువుల నిల్వలను సీజ్ చేసినట్లు చెప్పారు. నిబంధనలకు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
దాడులతో దుకాణాలు బంద్..
విజిలెన్స్ దాడులు మంగళవారం రాత్రి 11గంటల వరకు కొనసాగాయి. అధికారులు మొదటి దుకాణంలో తనిఖీలు చేస్తుండగా మండలంలోని మిగిలిన దుకాణదారులు షాపులను కట్టేసి అక్కడ నుంచి జారుకున్నారు. అన్ని ఎరువుల దుకాణాల్లో అనధికారిక ఎరువులు నిల్వలు ఉండడంతోనే యజమానులు దుకాణాలను కట్టేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏఓ శ్రీధర్, వీఏఏలు, సిబ్బంది పాల్గొన్నారు.
పీఏసీఎస్‌ల నుంచి ఎరువుల పక్కదారి?
మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌లు) నుంచి ఎరువులు భారీ మొత్తంలో పక్కదారి పట్టాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీఏసీఎస్‌ల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు సంఘాలకు వచ్చిన ఎరువులను మండలంలోని ఎరువుల షాపుల యజమానులకు విక్రయించినట్లు సమాచారం. పీఏసీఎస్‌ల్లో రైతులకు ఎరువులు విక్రయిస్తున్నట్లుగా చూపి, ఆ ఎరువులను దుకాణాలకు పక్కదారి పట్టిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. పీఏసీఎస్‌ల నుంచి వచ్చిన ఎరువులు కాబట్టే దుకాణాల్లో వీటికి బిల్లులు లేవని, దుకాణాల యజమానులు రికార్డులు కూడా పెట్టకుండా నిల్వ చేశారని అన్నదాతలు బాహాటంగానే చెబుతున్నారు. పీఏసీఎస్‌ల్లో రైతులకు ఎరువులు లేవని చెప్పి ఈ విధంగా బయట మార్కెట్‌లోని దుకాణాలకు విక్రయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఏసీఎస్‌లో ఎరువులు పక్కదారిపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.