
నానో ఎరువులపై అవగాహన అవసరం
ఏపీ మార్క్‌ఫెడ్ ఇగ్నైట్ సెల్‌ను సందర్శించిన
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడకుండా.. పంట నాణ్యత, ఉత్పత్తిని పెంచడంతో పాటు డబ్బును, సమయాన్ని ఆదా చేసే నానో ఎరువులపై అన్నదాతలకు సమన్వయ శాఖల అధికారులు అవగాహన కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏపీ మార్క్‌ఫెడ్ ఇగ్నైట్‌సెల్‌ను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు.
పోస్టర్ల ఆవిష్కరణ..
ఖరీఫ్ సీజన్ (2025–26)కు సంబంధించిన వివిధ పంటల కనీస మద్దతు ధరలు, ఏపీ మార్క్‌ఫెడ్ రైతులకు అందిస్తున్న సేవలు, సీఎం ఎయిడ్, సీఎం యాప్, మార్క్ రే ఈ–ఆక్షన్ ప్లాట్‌ఫామ్ తదితర వివరాలతో రూపొందించిన పోస్టర్లను, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అదేవిధంగా నానో యూరియా, నానో డీఏపీ, నానో జింక్, నానో కాపర్ తదితర ఎరువుల బాటిళ్లను పరిశీలించారు. నానో ఎరువులను తేలిగ్గా స్ప్రే చేయగలిగే కిసాన్ డ్రోన్ పనితీరును పరిశీలించారు. నానో ఎరువుల వల్ల దాదాపు 50 శాతం మేర ఎరువులు ఆదా అవుతాయన్నారు. పంట రకాలు, వివిధ దశల్లో వినియోగించాల్సిన మోతాదు, స్ప్రేయర్ల వినియోగం తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమాల్లో వీటిపై అవగాహన కల్పించాలన్నారు. మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ కె.నాగమల్లిక, మార్క్‌ఫెడ్ సిబ్బంది పాల్గొన్నారు.