
కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఏపీ ఈఏపీసెట్ – 2025లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతోంది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్‌లో సోమవారం ప్రశాంతంగా జరిగింది. ఎన్‌సీసీ అభ్యర్థులు 245 మంది, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అభ్యర్థులు 183, సీఏపీ అభ్యర్థులు 217 మంది చొప్పున 645 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశామని హెల్ప్‌లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి తెలిపారు.
నేటి షెడ్యూల్ ఇదీ..
మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎన్‌సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో 50,001 నుంచి చివరి ర్యాంకు వరకు, సీఏపీలో 1,00,001 నుంచి లక్షా యాభై వేల లోపు ర్యాంకు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులు ఈ నెల 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో వెబ్‌ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. ఎంపిక చేసుకున్న ఆప్షన్లల్లో మార్పులు, చేర్పులకు ఈ నెల 22వ తేదీ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఎస్టీల సమగ్రాభివృద్ధికి కృషి చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో షెడ్యూలు తెగల సమగ్రాభివృద్ధికి అందరూ సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో పాఠశాల బయట ఉన్న షెడ్యూలు తెగల బాలలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలన్నారు. ఆధార్‌కార్డు లేని వారిని గుర్తించి కార్డులు జారీ చేసేందుకు తగిన చొరవ చూపాలన్నారు. ఆరోగ్య కార్డులు, ఆయుష్మాన్‌కార్డులు జారీ చేసేందుకు డీఎంహెచ్‌ఓ కృషి చేయాలని ఆదేశించారు. మత్తుపదార్థాల బానిసల విముక్తికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. షెడ్యూలు తెగలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని, వారికి రేషన్‌కార్డులు, ఓటర్ ఐడీ, ఇంటి స్థలం కేటా యించేందుకు రెవెన్యూ అధికారులు చొరవ చూపాలని సూచించారు. వారి గృహాలకు అన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పీ–4 కార్యక్రమంలో ఎస్టీలను ప్రత్యేక భాగస్వామ్యులుగా చేసి వారి అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ రమణారావు, డీఈఓ పి.వి.జె.రామారావు, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ ఈఈలు లోకేష్, నటరాజ్, డీపీఓ జె.అరుణ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శర్మిష్ట, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఫణిదూర్జటి తదితరులు పాల్గొన్నారు.