
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం : ఎస్పీ
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మీ–కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోనే స్పందన హాల్‌లో జరిగిన మీ–కోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన ఎస్పీ, మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. చట్ట పరిధిలో వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం జరిగిన మీ–కోసంలో 38 అర్జీలు అందినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ బాధితుల నుంచి అర్జీలు అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు ఆలకించారు.
ముఖ్యమైన అర్జీలు ఇవీ..
● తాను తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నానని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ప్రస్తుతం తన భర్త వేరే మహిళ వ్యామోహంలో పడి తనను చిత్రహింసలు పెడుతున్నాడని పెనమలూరు మండలం పోరంకికి చెందిన ఓ వివాహిత ఫిర్యాదు చేసింది. ఆమెతో ఉండేందుకు అంగీకరించని పక్షంలో తనతో పాటు తన పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని కన్నీరు పెట్టుకుంది. అతని నుంచి రక్షణ కల్పించి తన కాపురాన్ని నిలబెట్టాలని ఎస్పీని వేడుకుంది.
● తాను చేపల చెరువు సాగు చేస్తున్నానని, కాకినాడకు చెందిన వ్యక్తి తన వద్ద చేపలను కొనుగోలు చేసి ఇప్పటి వరకు డబ్బు చెల్లించకపోగా చంపుతానని బెదిరిస్తున్నాడని బందరు మండలం పెదపట్నం గ్రామానికి చెందిన మోహనరావు ఎస్పీ ఎదుట వాపోయాడు. అతని నుంచి రక్షణ కల్పించి, తన డబ్బులు ఇప్పించాలని అర్జీలో కోరాడు.
● తన భర్త అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడని, అత్తమామలు సైతం సాధిస్తున్నారని పెద్దకళ్లేపల్లికి చెందిన వనజ ఫిర్యాదు చేసింది. అడిగిన కట్నం తీసుకురాకుంటే భర్తతో విడాకులు ఇప్పించి వేరే పెళ్లి చేసేందుకు అత్తమామలు సిద్ధపడుతున్నారని కన్నీరు పెట్టుకుంది. ఈ అర్జీలపై స్పందించిన ఎస్పీ చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు.