
మెరుగైన సేవలే లక్ష్యంగా కార్యాచరణ
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా మెరుగైన ప్రపంచం కోసం ఉత్తమ సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు కృష్ణా జిల్లా సహకార శాఖ అధికారి కె. చంద్రశేఖరరెడ్డి అన్నారు. సహకార వారోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా మంగళవారం కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు తాము కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాథమిక సహకార సంఘాల్లో నమూనా బోర్డు మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్, మోడల్ ఆడిట్ జరిగాయన్నారు. బుధవారం సహకార సంఘాలు, డీసీసీబీలలో లోన్‌మేళా నిర్వహించటం ద్వారా నూతన సభ్యులను చేర్చుకోవటం, డిపాజిట్ల సేకరణ నిర్వహిస్తామన్నారు. 3వ తేదీన సంఘా లు ఉత్పత్తి చేసినవి ప్రదర్శించటం, సంఘ చరిత్రను, అభివృద్ధిని ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. 4వ తేదీన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో సహకార రంగంపై రెండు గంటలపాటు బోధనలు చేస్తారన్నారు. 5వ తేదీన సహకార దినోత్సవం సందర్భంగా సంఘాల ఆవరణలో సహకార జెండా ఎగురవేస్తారన్నారు. ఈ విధంగా కార్యక్రమాలు చేపట్టి సహకార రంగం ద్వారా మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
కృష్ణా జిల్లా సహకారశాఖ అధికారి
చంద్రశేఖరరెడ్డి