
రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి దుర్మరణం
పామర్రు: రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి దుర్మరణం పాలైన ఘటన పామర్రు మండలంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బల్లిపర్రు గ్రామానికి చెందిన కలపాల జనీష్ తన ద్విచక్ర వాహనంపై తన ఇద్దరు పిల్లలు కలపాల జోయల్(15), అభిలను పామర్రులోని అసిస్సీ స్కూల్‌కు తీసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కురుమద్దాలిలోని రాణీ ఆక్వా వద్ద రివర్స్‌లో వస్తున్న లారీ అదుపు తప్పి వెనుకగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో జోయల్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రికి, తమ్ముడికి కూడా గాయాలయ్యాయి. జోయల్ అసిస్సీ స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పామర్రు ఎస్‌ఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.