
తండ్రి మందలించాడని ఇంటి నుంచి పరార్
కోనేరుసెంటర్: తండ్రి మందలించాడన్న కోపంతో ఓ ఇంటర్ విద్యార్థి ఇంటి నుంచి పరారయ్యాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం వలందపాలెంకు చెందిన కాపవరపు పవన్‌కుమార్ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. పవన్ కళాశాలకు వెళ్లకుండా స్నేహితులతో కలిసి తిరుగుతుండటంతో విషయం తెలుసుకున్న తండ్రి గట్టిగా మందలించాడు. దీంతో ఈ నెల 4వ తేదీన పవన్‌కుమార్ తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు పవన్ కోసం ఎక్కడ వెతికినా ప్రయోజనం లేకపోయింది. స్నేహితులు, బంధువులు, పరిచయస్తుల వద్ద ఆరా తీసినా ఫలితం లేకపోవటంతో మంగళవారం తండ్రి వాకలయ్య తన కుమారుడు కనిపించటంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పవన్ ఆచూకీ తెలిసిన వారు 9949216535, 8332983789, 9440796430 నంబర్‌లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.