
విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకం
మచిలీపట్నంఅర్బన్: కృష్ణాజిల్లాలో స్కూల్ బస్సుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారుతోంది. జిల్లా పరిధిలో ఉన్న 1009 ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో 736 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ పరీక్షలు చేసినట్టు రవాణాశాఖ లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన 273 బస్సులు ఫిట్‌నెస్ లేకుండానే రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. స్కూల్ బస్సులు నిజంగా పిల్లలకు సురక్షితమా అనేది ఇప్పుడు తల్లిదండ్రుల్లో ప్రధాన చర్చనీయాంశంగా ఉంది.
తుక్కుకు వెళ్లాయా?
పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు కావస్తున్నా ఇంకా జిల్లాలో 28 శాతం బస్సులు ఫిట్నెస్ పరీక్షకు రవాణా శాఖ కార్యాలయానికి రాలేదు. ఫిట్నెస్ లేని కొన్ని బస్సులను తుక్కుకు పంపించామని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే ఎన్ని తుక్కుకు వెళ్లాయి...మిగిలిన బస్సుల సంగతి ఏమిటి అన్న విషయంపై ఇప్పటికీ అధికారులకు స్పష్టత లేదు.
స్కూల్ బస్సులపై దృష్టి సారించాలి
ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు తిరిగి ప్రారంభం కావడంతో, ఆ బస్సులపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. స్కూల్ బస్సులకు సంబంధించిన ఆర్సీ, పర్మిట్, ఫిట్‌నెస్, ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్ తదితర అంశాలపై కచ్చితంగా తనిఖీలు చేయాలి. బస్సు నడిపే డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే లైసెన్స్, కనీసం ఐదేళ్ల అనుభవముందా, కంటి పరీక్షలు జరిగాయా అన్నదానిపై అధికారుల బృందం తనిఖీ చేయాలి.
జిల్లాలో 273 ఫిట్నెస్ లేని
స్కూల్ బస్సులు
మొత్తం 1009 స్కూల్ బస్సుల్లో
736 బస్సులకే ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి
పిల్లల భద్రతపై తల్లిదండ్రుల్లో
పెరుగుతున్న ఆందోళన