
రోడ్డు ప్రమాదంలో ఐటీఐ కళాశాల ఉద్యోగి దుర్మరణం
పామర్రు: విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిలో బల్లిపర్రు వద్ద ఐటీఐ కళాశాల జూనియర్ అసిస్టెంట్ రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం పాలైన సంఘటన శుక్ర వారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరులో నివాసం ఉంటున్న కొసనం రత్నాకర్(35) గుడివాడలోని ఐటీఐ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం తన మోటర్ బైక్‌పై గుడివాడకు విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై వస్తుండగా పామర్రు మండలం బల్లిపర్రు గ్రామ అడ్డరోడ్డు వద్ద వెనుక నుంచి వ్యాన్ బలంగా ఢీకొట్టింది. రత్నాకర్ బైక్‌పై నుంచి పడిపోవడంతో బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పామర్రు ఎస్‌ఐ రాజేంద్ర ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని వివరాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.