జెడ్పీ హైస్కూలుకు 50సెంట్ల భూమి వితరణ
కంకిపాడు: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన విద్య అందాలని జెడ్పీ సీఈఓ కె.కన్నమ నాయుడు అన్నారు. మండలంలోని ఉప్పలూరు గ్రామానికి చెందిన దాత అన్నే పద్మనాభరావు, ఉషారాణి దంపతులు రూ. 10 కోట్ల విలువైన 50సెంట్ల వ్యవసాయ భూమిని తన తల్లిదండ్రులు అన్నే రామలింగయ్య, రాజ్యలక్ష్మి జ్ఞాపకార్థం ఉప్పలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటుకు వితరణగా అందించారు. ఈ మేరకు జెడ్పీ సీఈఓ కన్నమ నాయుడుకి స్థల దస్తావేజులను శుక్రవారం అందజేశారు. తొలుత ఉప్పలూరు–వేల్పూరు రోడ్డు వెంబడి ఉన్న స్థలాన్ని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి సందర్శించారు. అనంతరం దాత పద్మనాభరావు నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఈఓ కన్నమనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటుగా దాతలు ముందుకు వచ్చి వసతుల కల్పనకు తోడ్పాటునందిస్తే పాఠశాలలు నూతన సొబగులు దిద్దుకుంటాయన్నారు.
విద్యార్థుల సౌలభ్యం కోసం..
దాత అన్నే పద్మనాభరావు మాట్లాడుతూ ఉప్పలూరు, వేల్పూరు గ్రామాల విద్యార్థులు ఉన్నత పాఠశాల చదువు కోసం దూరంగా ఉన్న పునాదిపాడు, మంతెన గ్రామాలకు వెళ్లాల్సివస్తోందన్నారు. చాలా మంది విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల ఉంటే అన్ని వర్గాల ప్రజలకు పాఠశాల అందుబాటులోకి వస్తుందని, విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మండల విద్యాశాఖ రూపొందించిన కరపత్రాన్ని సీఈఓ ఆవిష్కరించారు. జెడ్పీటీసీ బాకీ బాబు, ఏఎంసీ చైర్మన్ అన్నే ధనరామకోటేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌లు మద్దాలి రామచంద్రరావు, కొణతం సుబ్రమణ్యం, ఎంపీపీ నెరుసు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


