నేడు పల్స్ పోలియో
మచిలీపట్నంఅర్బన్: పోలియో నిర్మూలన లక్ష్యంగా ఈ నెల 21న జిల్లాలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.యుగంధర్ తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులు అందరికీ చుక్కల మందు వేయడమే లక్ష్యమన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 1,45,588 మంది ఉన్నారని, వారి కోసం 1,94,160 పోలియో డోసులను సిద్ధం చేశామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 986, పట్టణ ప్రాంతాల్లో 187, మొబైల్ బూత్‌లు 62, ట్రాన్సిట్ బూత్‌లు 23 చొప్పున 1,258 కేంద్రాల ద్వారా చిన్నారులకు చుక్కల మందు పంపిణీచేస్తామని తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, వాణిజ్య సముదాయాలు, పర్యాటక ప్రాంతాల్లో సంచరించే పిల్లల కోసం ట్రాన్సిట్ బూత్‌లు కీలకంగా పనిచేస్తాయన్నారు. ఆదివారం పల్స్ పోలియో శిబిరాలకు రాని చిన్నారుల కోసం 22, 23 తేదీల్లో ఇంటింటి సర్వే చేసి చుక్కల మందు వేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో 4,898 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా బందరులో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.


