బలమైన కుటుంబ వ్యవస్థతో ఆరోగ్యకర సమాజం
పెడన: బలమైన కుటుంబ వ్యవస్థతోనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ చైర్మన్ గుట్టాల గోపి అన్నారు. పెడనలో శనివారం ఉదయం జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార(డీసీఎల్‌ఏ) సంస్థ, జిల్లా పరిపాలనా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నూతన తరహా న్యాయ సేవల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన కుటుంబ సంబంధాలు సామాజిక స్థిరత్వానికి మూలమని, నేరాలు, సామాజిక వ్యతిరేక ప్రవర్తనలను తగ్గిస్తాయని అన్నారు. ప్రభుత్వానికి న్యాయవ్యవస్థలకు మధ్య వారధిగా డీసీఎల్‌ఏ పని చేస్తుందన్నారు. రాజీ మార్గం ద్వారా కక్షిదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు. సామాన్యులకు న్యాయం అందుబాటులో ఉంచడం, సాంఘిక దురాచారాల పోరాటంపై ప్రజలకు అవగాహన కల్పించడం, పిల్లల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా దూరమైన వారిని గుర్తించి వారికి చేరువ చేసేలా చర్యలు తీసుకోవడంలో డీఎల్‌ఎస్‌ఏ విశేష కృషి చేస్తుందని వివరించారు. పిల్లలను సరైన మార్గంలో నడిపించేలా తల్లిదండ్రులు చర్యలు చేపట్టాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. సమాజంలో ఇప్పటికీ బాల్యవివాహాలు జరగటం విచారకరమన్నారు.
కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య, జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతురాజు, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, అదనపు సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్ యుగంధర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పి.సాయిసుధ, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, జిల్లా అధికారులు కామరాజు, రాజేంద్ర ప్రసాద్, మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్ రాజా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా ఎస్పీ తదితరులు ఇతర న్యాయమూర్తులతో కలిసి సందర్శించి తిలకించారు. సమాజంలో బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ చిన్నారులు ప్రదర్శించిన లఘు నాటిక ప్రదర్శన, జానపద గీతాలు ఆకట్టుకున్నాయి.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి
బలమైన కుటుంబ వ్యవస్థతో ఆరోగ్యకర సమాజం


